తొలి దశలో కోటి మందికి టీకా

14 Dec, 2020 03:23 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డోసుల్ని బట్టి ఏపీలో వ్యాక్సిన్‌ వేసే ప్రణాళిక

తొలి దశను నెలలో పూర్తిచేసేందుకు ఏర్పాట్లు

హెల్త్‌కేర్‌ వర్కర్లకే మొదటి ప్రాధాన్యత

మొదటి డోసు వేశాక 8 వారాలు జాగ్రత్తగా ఉండాల్సిందే

4,762 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేసేందుకు కార్యాచరణ

నిరంతరం 9,724 మంది వ్యాక్సినేటర్లు అందుబాటులో

సాక్షి, అమరావతి: కేంద్రం నుంచి రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ (టీకా) రాగానే నెలలో కోటిమందికి వేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం పంపే డోసుల్ని బట్టి ఎంతమందికి వస్తే అంతమందికి టీకా వేస్తారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఎప్పుడు సరఫరా అవుతుందన్న స్పష్టత లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన్‌కు చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం 4,762 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి ఒక్కో కేంద్రంలో రోజుకు వందమందికి టీకా వేసే అవకాశం ఉంది. వచ్చే వ్యాక్సిన్‌ డోసుల్ని బట్టి రోజుకు ఒక్కో కేంద్రంలో 70 మంది వరకు వేసినా నెలలో కోటిమందికి వేయవచ్చని అంచనా వేస్తున్నారు. తొలిదశ టీకాను నెలరోజుల్లో పూర్తిచేసేందుకు మౌలిక వసతులు సమకూరుస్తున్నారు.

6 నెలల తరువాత రెండో డోసు
రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 4,762 కేంద్రాల్లో 30 రోజుల్లో మొత్తం 1,42,857 సెషన్స్‌ (ఒకరోజు ఒక కేంద్రంలో వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని ఒక సెషన్‌ అంటారు) నిర్వహిస్తారు. ఒక్కో సెషన్‌లో 70 మందికి టీకా వంతున నెలలో మొత్తం కోటిమందికి వేయాలని ఆరోగ్యశాఖ నిపుణులు నిర్ణయించారు. వ్యాక్సిన్‌ వేసేందుకు 9,724 మంది వ్యాక్సినేటర్లు అంటే ఏఎన్‌ఎంలు నిరంతరాయంగా పనిచేస్తారు. ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌కేర్‌ రంగంలో ఉన్నవారికి, అంగన్‌వాడీ వర్కర్లకు అంటే 3,66,442 మందికి టీకా వేస్తారు.

తర్వాత ప్రాధాన్యతా క్రమంలో పోలీసులు, శానిటేషన్‌ వర్కర్లు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వ్యాక్సిన్‌ ఇస్తారు. టీకా వేయించుకున్న తర్వాత 6 నుంచి 8 వారాల వరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ తర్వాతే యాంటీబాడీస్‌ వృద్ధిచెందే అవకాశం ఉందని, అందువల్ల కోవిడ్‌ టీకా వేయించుకున్నాక గడువు వరకు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో అవసరమైతే ఏఎన్‌ఎంతో పాటు ఎంబీబీఎస్, బీడీఎస్‌ వైద్యులనుగానీ, రిటైర్డ్‌ డాక్టర్లనుగానీ, ఫార్మసిస్ట్‌లు, నర్సింగ్, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం విద్యార్థులనుగానీ నియమిస్తారు. తొలిదశలో టీకా వేసిన వారికి రెండోదశలో ఆరునెలల తర్వాత రెండోడోసు వేస్తారు.  

మరిన్ని వార్తలు