తల్లులకు టీకా.. చకచకా

14 Jun, 2021 03:36 IST|Sakshi

పిల్లలకు కరోనా వస్తే తల్లులకు సోకకుండా వ్యాక్సినేషన్‌ 

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన అమలు

6 రోజుల్లోనే 3,19,699 మందికి టీకా

విదేశాలకు వెళ్లే 8 వేల మందికి కూడా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు టీకాలు వేసే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. గడచిన 6 రోజుల్లో 3,19,699 మంది తల్లులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. తల్లులకు విధిగా టీకాలు వేయాలని ఈ నెల 7న సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆ మరుసటి రోజు అంటే జూన్‌ 8 నుంచి 13వ తేదీ వరకూ 3.19 లక్షల మందికి టీకాలు వేశారు. చిన్నారులకు కరోనా సోకితే.. ఆ పిల్లలు తల్లి ఒడిలోనే ఉంటారు కాబట్టి తల్లులకు సోకకుండా వ్యాక్సిన్‌ వేయాలని సీఎం సూచించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించి తల్లులకు అత్యంత ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ వేస్తున్నారు.

చిన్నారుల బర్త్‌ సర్టిఫికెట్, టీకా కార్డు వంటి ఏ ఆధారం చూపినా ఆ తల్లులకు సీవీసీ (కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌)లో విధిగా టీకా వేయాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు 18 లక్షల మంది ఉంటారని అంచనా. మరికొద్ది రోజుల్లోనే తల్లులుందరికీ వ్యాక్సిన్‌ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు విద్యా, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారికి వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్‌ వేశారు. అలాంటి వారు గడచిన ఆరు రోజుల్లో 8 వేల మంది వరకూ టీకాలు వేయించుకున్నారు.

మరిన్ని వార్తలు