వ్యాక్సినేషన్‌ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్‌

4 Jun, 2021 12:16 IST|Sakshi

ఈ విషయంలో సీఎంలంతా ఒక మాట మీదే ఉండాలి

అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన ముఖ్యమంత్రి జగన్‌

కేంద్రం చేతుల్లో మాత్రమే వ్యాక్సిన్ల కొనుగోలుకు అనుమతి ఇచ్చే అధికారం 

దీంతో మా రాష్ట్రం పిలిచిన గ్లోబల్‌ టెండర్లకు స్పందన రాలేదు

మిగతా రాష్ట్రాల టెండర్లదీ ఇదే పరిస్థితి

వ్యాక్సిన్‌ ప్రక్రియ ఆలస్యం అయ్యే కొద్దీ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది

సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి మనమంతా ఏకతాటిపై ఉండాలి

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 కట్టడిలో కీలకమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను రాష్ట్రాల సమన్వయంతో పూర్తిగా కేంద్రమే నిర్వహించాలని, ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే మాట మీద నిలబడదామంటూ ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని పలువురు ముఖ్యమంత్రులకు గురువారం లేఖలు రాశారు.

‘అంతర్జాతీయ టెండర్ల ద్వారా వ్యాక్సిన్‌ కొనుగోలు చేసి, రాష్ట్రంలో ఉచితంగా వ్యాక్సిన్‌ అందిద్దామన్నా, దీనికి అనుమతులు కేంద్రమే ఇవ్వాల్సి ఉండటంతో అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిలో వ్యాక్సినేషన్‌ బాధ్యత పూర్తిగా కేంద్రమే తీసుకోవాలని అందరం ఏకమై అడుగుదాం’ అని ఆ లేఖల్లో పేర్కొన్నారు. దేశంలోని పలువురు ముఖ్యమంత్రులకు ఆయన రాసిన లేఖల్లో భాగంగా.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రాసిన లేఖ ఇదీ..

శ్రీ పినరయి విజయన్‌ జీ,
 మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నా. భయంకరమైన కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ సెకండ్‌ వేవ్‌ నుంచి భారతదేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్న ప్రాథమిక సంకేతాలు అందుతున్నాయి. అయినా కోవిడ్‌ కట్టడి చర్యలను అప్పుడే ఆపివేయలేం. మీ రాష్ట్రంలో బలమైన ఆరోగ్య వ్యవస్థతో తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతున్నారని భావిస్తున్నా. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో మన పదునైన ఆయుధం వ్యాక్సిన్‌ మాత్రమే. ఇండియాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవిక విషయాలు చూసిన తర్వాత నేను మీకు లేఖ రాస్తున్నా.

రాష్ట్రంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఉచితంగా ఇవ్వాలన్న లక్ష్యంలో భాగంగా నేరుగా వ్యాక్సిన్‌ కొనుగోలు చేయడానికి అంతర్జాతీయ టెండర్లకు వెళ్లాం. జూన్‌ 3 సాయంత్రం 5 గంటల వరకు బిడ్లు సమర్పించడానికి గడువు ఇచ్చినా ఒక్కరు కూడా బిడ్లు దాఖలు చేయకపోవడం నిరాశ పరిచింది. వ్యాక్సిన్‌ కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్రాల చేతిలో ఏమీలేదు. వ్యాక్సిన్ల కొనుగోలు ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల మధ్య అంశంగా మారడం, వ్యాక్సిన్‌ కొనుగోలుకు ఆమోదం తెలిపే అధికారం కేంద్రం చేతిలో ఉండటం ఈ పరిస్థితికి కారణాలుగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అనేక సమన్వయ అంశాలతో ముడిపడి ఉంది. కొన్ని రాష్ట్రాలు మాకు తగినంత వ్యాక్సిన్‌ సరఫరా లేదని భావిస్తున్నాయి. గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్న రాష్ట్రాలకు సరైన స్పందన కూడా రావడం లేదు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆలస్యం అయ్యే కొద్ది ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 

  నేను అందరి ముఖ్యమంత్రులను కోరేది ఒక్కటే.. వ్యాక్సినేషన్‌ బాధ్యతను పూర్తిగా కేంద్రమే చేపట్టాలని ఒకే మాటగా వినిపిద్దాం. ప్రారంభంలో కేంద్రమే వ్యాక్సినేషన్‌ పూర్తి బాధ్యత తీసుకున్న విషయం మీకు తెలిసిందే.  ఆరోగ్య సిబ్బందికి సరైన సమయంలో వ్యాక్సినేషన్‌ చేయడం మంచి ఫలితాలను ఇచ్చింది. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి ముందుగా వ్యాక్సిన్‌ ఇవ్వాలి అన్న నిర్ణయంతో సరైన సమయంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయగలిగాం. తద్వారా కరోనా సెంకడ్‌ వేవ్‌ ఉధృతిలో కూడా వారు వైరస్‌తో పోరాడగలిగారు. 

వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాలో అనేక అవరోధాలు ఉండగా, వ్యాక్సిన్‌ కొనుగోళ్లను అధికంగా రాష్ట్రాలే చేపట్టాలనే నిర్ణయం సమంజసం కాదు. వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో ఉన్న సవాళ్లను గత నెలన్నరగా మనం చూస్తున్నాం. దీనివల్ల రాష్ట్రాలు వైద్య సదుపాయాలు పెంచుకోవడానికి నిధులను వినియోగించుకోకుండా, మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ విధంగా అయినా వ్యాక్సిన్‌ సరఫరాను పెంచుకోవడం తక్షణావసరం. రాష్ట్రాల సహకారంతో నడిచే కేంద్రీకృత, సమన్వయ వ్యవస్థ ఉంటే దేశ ప్రజలకు మంచి ఫలితాలు అందుతాయి.  ముఖ్యమంత్రులం అంతా ఒకేమాటపై ఉండి ఈ సంక్షోభాన్ని అధిగమిద్దాం. దీనికి మద్దతు ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 

ఇక్కడ చదవండి: 'కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు ఆర్థిక సాయం అందాలి'
దేశ చరిత్రలోనే ప్రథమం.. కొత్త చరిత్రకు సీఎం జగన్‌ శ్రీకారం

మరిన్ని వార్తలు