పిల్లలకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు

28 Dec, 2021 09:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే జనవరి 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి టీకా రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సోమవారం ప్రకటించింది. కోవిన్‌ యాప్‌/వెబ్‌సైట్‌లో అర్హులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు ఉపయోగించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

చదవండి: 2021 రివైండ్‌: టీడీపీకి పరాభవ ‘నామం’ 

ప్రభుత్వ గుర్తింపు కార్డులులేని వారు విద్యా సంస్థలు మంజూరు చేసిన గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రాష్ట్రంలో 15–18 ఏళ్ల వయసులోపు వారు 22,41,000 మంది ఉన్నారు. టీకాల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సి ఉంది. కోవిన్‌ యాప్‌లో రిజస్ట్రేషన్‌ చేసుకోకుంటే, స్పాట్‌ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుందో, లేదో అనే విషయం కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 

రిజిస్ట్రేషన్‌ ఇలా.. 
కోవిన్‌ మొబైల్‌ యాప్‌ లేదా  https:// selfregistration. cowin. gov. in// పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.  
యాప్‌ లేదా పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యాక ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. 
అనంతరం ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.   
ఒక ఫోన్‌ నంబర్‌పై నలుగురు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. (ఉదా.. గతంలో తల్లిదండ్రులిద్దరూ కోవిన్‌ యాప్‌లో రిజిస్టరైన నంబరుతో వారి పిల్లల (15–18ఏళ్ల మధ్య వారైతేనే) పేర్లు కూడా నమోదు చేసుకోవచ్చు.)  
 వెరిఫికేషన్‌ పూర్తయిన అనంతరం రిజిస్ట్రేషన్‌ పేజీ వస్తుంది. అందులో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి.  
గుర్తింపు కార్డు కింద ఆధార్‌ను ఎంచుకోవాలి. ఆధార్‌లేని పక్షంలో పదో తరగతి విద్యార్థి గుర్తింపు ఐడీ నంబరును నమోదు చేయవచ్చు.   

మరిన్ని వార్తలు