సరఫరా పెరిగితే 18 ఏళ్లు దాటిన వారికీ వ్యాక్సిన్‌ 

10 May, 2021 04:13 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేయాలని నిర్ణయం 

వ్యాక్సిన్‌ లభ్యత లేదు కాబట్టి జాప్యం  

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అనుకున్న రీతిలో ఉత్పత్తి లేనందున జాప్యం జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. కేంద్రం ఇచ్చేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసి అందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు నిర్ణయించిందన్నారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఆస్పత్రులన్నింటిలో ఆరోగ్యశ్రీ పడకలపై కలెక్టర్లు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. సోమవారం సాయంత్రానికి ఎన్ని పడకలు వస్తాయి.. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం ఎంత మందికి చేయొచ్చు అన్నది తెలుస్తుందన్నారు.

రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరఫరా గణనీయంగా పెంచామని తెలిపారు. 330 మెట్రిక్‌ టన్నుల నుంచి 561 టన్నుల వరకు పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయించిందన్నారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్‌ ఎక్కడా కొరత లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24,861 ఇంజక్షన్లు ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్‌ 16వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకూ 104 కాల్‌ సెంటర్‌కు 2 లక్షలకు పైగా కాల్స్‌ వచ్చాయన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ ప్రక్రియ కేవలం రెండో డోసు వారికి మాత్రమే వేయాలని కలెక్టర్లను ఆదేశించామని, ఆ తర్వాత డోసుల రాకను బట్టి అందరికీ వేస్తామన్నారు. మనకు రానున్న డోసులను 45 ఏళ్లు పైబడిన వారికి ఇస్తామని, రెండ్రోజుల్లో కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి అందిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. 

కోవిడ్‌ డ్యూటీ చేసిన వారికి వెయిటేజీ 
రాష్ట్రంలో కోవిడ్‌ డ్యూటీలు చేసిన వారికి శాశ్వత నియామకాల్లో వెయిటేజీ ఇచ్చినట్టు తెలిపారు. 6 మాసాలు డ్యూటీ చేసిన వారికి 5 మార్కులు, ఏడాది చేస్తే 10 మార్కులు, ఏడాదిన్నర చేస్తే 15 మార్కులు ఇచ్చామన్నారు. కష్టకాలంలో పని చేసిన వీళ్లందరికీ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు.  

మరిన్ని వార్తలు