వాహన 'ధీమా'

28 Apr, 2022 04:04 IST|Sakshi

‘వాహన బీమా మిత్ర’ వెబ్‌ అప్లికేషన్‌కు రూపకల్పన

సాక్షి, అమరావతి: ఓ వాహనం ప్రమాదానికి గురై ఆ వాహన చోదకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆ వాహనానికి చెల్లించిన ఇన్సూరెన్స్‌ పత్రాలను జతచేసి పరిహారం కోసం దరఖాస్తు చేస్తే.. ఆ వాహనానికి చేసిన బీమా నకిలీదని తేలింది. దాంతో బాధిత కుటుంబానికి ఎలాంటి పరిహారం లభించలేదు. వాహన బీమా నకిలీ దందా ఉచ్చులో పడి ఆ కుటుంబం మోసపోయింది. ఏటా ఇలాంటి కేసులు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా దాదాపు 40 లక్షల వాహనాలకు నకిలీ బీమా చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అవగతం చేసుకోవచ్చు.

ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రంగంలోకి దిగిన రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(ఏపీ డీఆర్‌ఐ), రవాణా శాఖ సంయుక్తంగా ‘వాహన బీమా మిత్ర’ అనే వెబ్‌ అప్లికేషన్‌ రూపొందించాయి. అందుకోసం ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ)కు చెందిన ఇన్సూరెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (ఐఐబీ)తో ఏపీ డీఆర్‌ఐ ఇటీవల ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ అప్లికేషన్‌ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.  

దశాబ్దాలుగా దందా 
రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న వాహన నకిలీ బీమా దందాపై గతేడాది ‘వాహన బీమాకు నకిలీ మకిలీ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కొందరు నకిలీ ఏజెంట్లు, వాహన కాలుష్య తనిఖీ వాహనాల కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై రాష్ట్ర డీఆర్‌ఐ రెండు దశల్లో జరిపిన దర్యాప్తులో విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. 15 బీమా కంపెనీల పేరిట జారీ చేసిన 2,80,873 వాహనాల బీమా పాలసీలను పరిశీలించగా.. వాటిలో ఏకంగా 1,20,623 పాలసీలు బీమా కంపెనీల డేటాతో మ్యాచ్‌ కాలేదు. రెండో దశలో రాష్ట్ర రవాణా శాఖ డేటాబేస్‌లో ఉన్న 1,111 వాహన బీమా ప్రీమియంలను పరిశీలించారు. వాటిలో ఏకంగా 468 బీమా పాలసీలు నకిలీవని, మరో 80 పాలసీలు అర్హతలేని కంపెనీలవని తేలింది.  రాష్ట్రంలో ఏటా దాదాపు 1.25 కోట్ల వాహనాలకు బీమా చేస్తున్నారు. వాటిలో  దాదాపు 40 లక్షల పాలసీలు నకిలీవేనని డీఆర్‌ఐ అంచనా వేసింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 5వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. నకిలీ పాలసీలు చేయించిన వారికి పరిహారం అందడం లేదు.

ఇకపై నకిలీలకు తావుండదు
‘వాహన బీమా మిత్ర’ వెబ్‌ అప్లికేషన్‌ సేవలను రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ప్రభుత్వం విస్తరిస్తోంది. ఐఐబీ తమ వద్ద ఉన్న దేశంలోని వాహన బీమా కంపెనీల డేటాబేస్‌ను ఈ అప్లికేషన్‌లో అందుబాటులో ఉంచుతుంది. ఏ వాహనదారుడైన తన వాహనం నంబర్, బీమా పాలసీ నంబర్లను ఆ వెబ్‌ అప్లికేషన్‌లో నమోదు చేస్తే.. వెంటనే ఆ బీమా పాలసీ అసలైనదా కాదా అన్నది తెలుసుకోవచ్చు. నకిలీ బీమా పాలసీ అని తేలితే ఆ పాలసీ చేయించిన ఏజెంట్‌పై వెంటనే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది.

దాంతో పోలీసులు ఆ ఏజెంట్‌పై చర్యలు తీసుకుంటారు. దాంతో నకిలీ బీమా పాలసీలు చేయించే ఏజెంట్ల ఆటకట్టించడం సాధ్యమవుతుంది. తాము చేయించింది నకిలీ బీమా అని నిర్ధారణ అయితే వాహనదారులు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సరైన బీమా పాలసీని ఆన్‌లైన్‌ ద్వారా గానీ బీమా కంపెనీ అధికారికంగా గుర్తించిన ఏజెంట్‌ ద్వారా గానీ తీసుకోవచ్చు. దాంతో ఆ వాహనం ఎప్పుడైనా ప్రమాదానికి గురైతే బీమా రక్షణ లభిస్తుంది.  ఈ వెబ్‌ అప్లికేషన్‌ను గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఆ గ్రామ/వార్డు సచివాలయం పరిధిలో ఉన్న వాహనాల బీమా పాలసీలను పరిశీలించి వాటిలో నకిలీవి ఉంటే వెంటనే సదరు వాహనదారులను అప్రమత్తం చేస్తారు.

డిస్కౌంట్‌ ఇచ్చేలా చర్చలు
‘వాహన బీమా మిత్ర’ వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా వాహన బీమా చేయించుకునే సౌలభ్యం కల్పించాలని డీఆర్‌ఐ భావిస్తోంది. అందుకోసం బీమా కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఆ వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా పాలసీ తీసుకుంటే కొంత డిస్కౌంట్‌ ఇచ్చే అంశాన్నీ పరిశీలిస్తోంది. వాహన బీమా పాలసీ కాల పరిమితి ముగుస్తుందనగా ఆ వాహనదారు మొబైల్‌కు మెసేజ్‌ పంపి అప్రమత్తం చేస్తారు. గడువులోగా పాలసీని     రెన్యువల్‌ చేసుకునేలా చూస్తారు. 

మరిన్ని వార్తలు