అడవి అంచున.. అల వైకుంఠపురం

7 Nov, 2021 05:26 IST|Sakshi

సంప్రదాయ వృత్తులను వదిలి వ్యవసాయం వైపు అడుగులు

నాగలి పట్టి బీడు భూముల్లో పంటల సాగు

కట్టుబాటుతో సంపూర్ణ మద్య నిషేధం అమలు

చరిత్ర గతిని మార్చుకున్న ఓ పల్లె కథ

వారంతా సంచార జీవులు.. చెరువు గట్లు, ఊరి చివర జాగాల్లో పాకలు వేసుకుని బతికేవారు. చేలల్లో ఎలుకలు.. బోదెల్లో చేపలు పట్టడం ప్రధాన వృత్తి. అక్కడక్కడా పొలాలకు కాపలాదారులుగా ఉండటం.. కొండకెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకోవడం.. తప్పని పరిస్థితుల్లో వేటగాళ్లుగా మారడం.. అదీ కుదరకపోతే ఉదయాన్నే ఇంటింటికీ వెళ్లి సద్దికూడు బిచ్చమెత్తి పొట్ట నింపుకోవడం చేస్తుంటారు. చింపిరి జుత్తు.. చిరిగిన దుస్తులతో దర్శనమిచ్చే యానాదుల జీవన చిత్రమిది. అత్యంత వెనుకబడిన తెగకు చెందిన ఆ కుటుంబాల్లో కొన్ని అడవి అంచున ఓ గ్రామాన్ని నిర్మించుకున్నాయి. కట్టెలు కొట్టిన చేతితో నాగలి పట్టి రైతు కుటుంబాలుగా మారాయి. తాగుడుకు స్వస్తి పలికి చైతన్యవంతమయ్యాయి. తమ చరిత్ర గతిని మార్చుకున్నాయి. తరతరాల నిరక్షరాస్యతను ఛేదించి అక్షర కాంతి నింపుకుంటున్నాయి. ఇలపై వెలిసిన ఈ అల వైకుంఠపురంలోకి తొంగిచూస్తే..

సాక్షి, అమరావతి బ్యూరో/కారంపూడి: గుంటూరు జిల్లా కారంపూడి మండలం నరమాలపాడు శివారు నల్లమల అడవి అంచున ఉంది వైకుంఠపురం. 1965 నాటికి ఇక్కడ నాలుగైదు యానాద కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఒబ్బాని రంగనాయకులు, చేవూరి లక్ష్మయ్య, రాపూరి అంకులు, కొమరగిరి నీలకంఠం కుటుంబాలతో అక్కడ అప్పట్లో చిన్నపాటి కాలనీ ఏర్పాటైంది. చుట్టూ సారవంతమైన భూములుండటంతో ఆ కుటుంబాలు పంటలు వేయడం ప్రారంభించాయి. తర్వాత కాలంలో వీరిని చూసి ఒక్కొక్క యానాద కుటుంబం అక్కడకు చేరింది. ఇప్పుడు అక్కడ వారివి 310 గడపలయ్యాయి. సుమారు 940 మంది జనాభా నివాసం ఉంది. వ్యవసాయమే వారి ప్రధాన వృత్తిగా మారింది.  ప్రతి ఇంటికీ పొలం సమకూరింది. ప్రతి చేనుకు బోరు, మోటార్‌ సమకూరాయి. 

సమాజానికి మార్గదర్శకంగా కట్టుబాటు
దశాబ్దాలుగా అక్కడ మద్య నిషేధం అమలవుతోంది. అనాదిగా నల్లమల అటవీ ప్రాంతం నాటుసారా తయారీకి అడ్డాగా ఉన్నా.. వైకుంఠపురంలో మాత్రం ఆ వాసనే లేదు. సారానే కాదు.. మద్యం అమ్మడం, తాగడాన్ని కూడా గ్రామస్తులంతా మూకుమ్మడిగా నిషేధించారు. గ్రామంలో ఇప్పటివరకు ఒక్క నేరం కూడా నమోదు కాలేదు. అక్కడి వారెవరూ పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కిన దాఖలాలు కూడా లేవు. గ్రామంలోని పిల్లలంతా చదువుకుంటున్నారు. 12 మంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలలో  స్థిరపడ్డారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇలా వారంతా కష్టాన్ని, విలువల్ని నమ్ముకుని వైకుంఠపురం పేరును సార్థకం చేసుకున్నారు.

వందకు పైగా జగనన్న ఇళ్లు
వైఎస్సార్‌సీపీ రాకతో వైకుంఠపురంలో వందకు పైగా కుటుంబాలకు వైఎస్సార్‌ జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరయ్యాయి. ఇకపై గ్రామంలో పక్కా ఇల్లు లేని వారంటూ ఉండరు. గ్రామం మొత్తం వైఎస్సార్‌ సీపీ కుటుంబమే. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంపీటీసీలుగా ఆ గ్రామస్తులకే అవకాశం ఇస్తున్నారు. చలంచర్ల విశ్వనాథం, ఇండ్ల అప్పారావు, రాపూరి సామ్రాజ్యం, యాకసిరి లక్ష్మి ఎంపీటీసీలుగా పనిచేయగా.. ప్రస్తుతం చేపూరి భవాని ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. 

వ్యవసాయంలో ముందడుగు వేస్తున్నాం
నిజానికి మాకు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు. పత్తి, మిరప, వరి, కంది పంటలు సాగు చేస్తున్నాం. ఇప్పుడు ఉద్యాన పంటలపైనా దృష్టి పెట్టాం. గ్రామంలో పదెకరాల దాకా తైవాన్‌ జామ తోటలు సాగు చేస్తున్నారు. బత్తాయి, మామిడి తోటలు కూడా పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామంగా రూపుదాల్చక ముందు మేమంతా కరెంటు లేకుండా అడవిలోనే గడిపాం. ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకుని ముందుకుపోతున్నాం. ఇందిరమ్మ, రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చలవ వల్ల అందరికీ ఇళ్లు, స్థలాలు సమకూరాయి. విడతల వారీగా ప్రతి ఇంటికి సేద్యం భూమి లభించింది.
– ఒబ్బాని కనకయ్య, వైకుంఠపురం గ్రామ స్థాపకుల్లో ఒకరు

రైతులుగా ఎదిగాం
మా చిన్నప్పుడు ఇల్లు వాకిలి సక్రమంగా ఉండేవి కాదు. ఏదో ఒక చెరువు గట్టున, ఊరి చివర జాగాల్లో పాకలు వేసుకుని ఉండేవాళ్లం. ఇప్పుడు మాకంటూ ఒక ఊరు ఏర్పడింది. మా పూర్వీకులు తరతరాలుగా గడిపిన జీవితాలను తలుచుకుంటే నిజంగా ఇది ఎంతో ముందడుగే. గతంలో పొలాలకు కాపలా ఉండడం, ఎలుకల బుట్టలు పెట్టడం, చేపలు పట్టడం వంటి పనులతోపాటు కట్టెలు కొట్టుకుని జీవించేవాళ్లం. క్రమేణా ఆ వృత్తుల నుంచి రైతులుగా ఎదిగాం. ఇప్పుడు మంచి పంటలు పండిస్తున్నాం.
– చేవూరి లక్ష్మయ్య, గ్రామ పెద్ద, వైకుంఠపురం

పొలాలున్నాయ్‌..  చదువులొచ్చాయ్‌
మా గ్రామంలో అందరికీ పొలాలున్నాయి. మూడు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాం. జీవితాలు కొంచెం మెరుగుపడగానే పిల్లలను చదివించుకోవాలనే తలంపు వచ్చింది. గ్రామంలో పాఠశాల కూడా పెట్టడంతో పిల్లలను చదివించుకుంటున్నాం. ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా పెరుగుతున్నారు. అనేక శతాబ్దాలుగా సంచార జీవితం గడుపుతూ వేటతో పొట్టనింపుకునే స్థాయి నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని చదువులో కూడా ముందడుగు వేస్తున్నాం. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా అభివృద్ధికి అడుగడుగునా అండగా ఉంటున్నారు. 
– యాకసిరి లక్ష్మి, మాజీ ఎంపీటీసీ

మరిన్ని వార్తలు