తిరుమల: ముగిసిన వైకుంఠ ద్వార దర్శనం 

12 Jan, 2023 05:38 IST|Sakshi
ఆలయం వెలుపల ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి కుటుంబం

తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం బుధవారం అర్ధరాత్రితో ముగిసింది. గురువారం నుంచి యథావిధిగా శ్రీవారి కార్యక్రమాలు జరగనున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. టైమ్‌ స్లాట్‌ టికెట్లు పొందిన వారికి కేటాయించిన నిర్ణీత సమయంలో త్వరితగతిన దర్శనం లభిస్తోంది.

మంగళవారం అర్ధరాత్రి వరకు 58,184 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 16,122 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.­4.20 కోట్లు వేశారు.  శ్రీవారిని తెలంగాణ హైకో­ర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటేశ్వరరెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైకుంఠ ద్వారంలో స్వామిని దర్శించుకున్నారు.

కాగా,  వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం తిరుమల నడక మార్గంలో శాశ్వతంగా షెడ్లు ఏర్పా­టు చేసే కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో కార్యక్రమం శుక్రవా­రం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈవో ఏవీ ధర్మారెడ్డితో మాట్లాడదలచుకున్న భక్తులు 0877–2263261 ఫోన్‌ నంబర్లో సంప్రదించవచ్చు. 

మరిన్ని వార్తలు