స్వర్ణ రథంపై సర్వాంతర్యామి

3 Jan, 2023 08:47 IST|Sakshi

తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం

గోవిందనామ స్మరణతో మార్మోగిన సప్తగిరులు

రాష్ట్ర వ్యాప్తంగా వైష్టవాలయాలకు పోటెత్తిన భక్తులు

తిరుమల/మంగళగిరి/సింహాచలం/శ్రీశైలం టెంపుల్‌/నెల్లిమర్ల: ఇల వైకుంఠం తిరుమలలో సోమవారం వైకుంఠ ఏకాదశి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వర్ణరథంపై సర్వాంతర్యామి అయిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. గో­వింద నామ స్మరణతో సప్తగిరులు పులకించాయి. శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధన అనంతరం వైకుంఠ ఏకాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సామాన్య భక్తులకు సైతం గంట ముందుగానే ఆరు గంటలకే సర్వదర్శనం ప్రారంభించారు.

అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి సన్నిధిని అరుదైన పుష్పాలు, ఫలాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలను వినియోగించారు. పది టన్నుల పుష్పాలు, లక్ష కట్‌ ఫ్లవర్స్‌ అలంకరణకు వాడారు. ఆలయ మహాగోపురానికి పుష్పాలతో ఏర్పాటు చేసిన విష్ణుమూర్తి, శంఖుచక్రాలు.. నామం బోర్డు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మండపం లోపల శ్రీ మహాలక్ష్మి, దశావతారాలతో పాటు శ్రీమహా విష్ణువు విగ్రహాన్ని ఏర్పాటు­చేశారు. ఈ మండపాన్ని సందర్శించిన భక్తులు ఆనంద పరవశులవుతున్నారు. ఆలయం వెలుపల విద్యుత్‌ దీపాలతో ఏర్పాటు చేసిన స్వామి వారి నిలువెత్తు విగ్రహాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నిలువెత్తు బంగారాన్ని ర«థంగా మార్చి దేవేరులతో కలిసి కోనేటిరాయుడు ఆలయ తిరువీధుల్లో ఊరేగడాన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న అశేష భక్తవాహిని స్వర్ణర«థ వాహనసే­వను తిలకించి స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. మహిళా భక్తులు ఉత్సాహంతో స్వర్ణర«థాన్ని లాగారు.

నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం:
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిర్ణీత సమయంలో కేటాయించిన టైమ్స్‌ స్లాట్‌ టికెట్లకు దర్శనమవుతుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 53,101 మంది స్వామి వారిని దర్శించుకోగా, 23,843 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.48 కోట్లు సమర్పించారు.    

నేడు చక్రస్నానం
వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి మంగళవారం తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 గంటల మధ్య చక్రస్నాన మహోత్సవం ఏకాంతంగా నిర్వహించనున్నారు. 

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం పలువు­రు ప్రముఖులు వైకుంఠ ద్వారంలో శ్రీవారిని దర్శిం­చుకున్నారు. తిరుమల ఆలయ పెద్ద జీయర్, చిన్న జీయర్‌ స్వామి, తమిళనాడు హైకోర్టు ప్రధా­న న్యాయమూర్తి డి.రాజా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దినేష్‌ కుమార్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గంగారాం, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నంద, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ టి.రాజశేఖర్‌రావు, జస్టిస్‌ రవినాథ్‌ తిలహరి, జస్టిస్‌ రవీంద్రబాబు, కేరళ హైకో­ర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్వీ భట్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.శ్రీని­వాస్, జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్, కర్ణాటక గవర్నర్‌ తవార్‌ చంద్‌ గెహ్లా, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాష్ట్ర మంత్రు­లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వ­రరావు, గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, మేరు­గ నాగార్జున, అంబటి రాంబాబు,  ఎంపీ వేమి­రెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, నేతలు సీఎం రమేష్, విష్ణువర్ధన్‌ రెడ్డి ఉన్నారు.

వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం
గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి వారు ముక్కోటి ఏకా­దశి సందర్భంగా సోమవారం ఉత్తర ద్వా­రం­లో భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సామాన్య భక్తుల క్యూలై­న్‌­లో వెళ్లి దర్శించుకున్నారు. విశాఖ జిల్లాలోని సింహాచలం క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠవాసుడిగా శేషత­ల్పంపై భక్తులకు దర్శనమి­చ్చారు. విశాఖ శ్రీశా­ర­దా పీఠాధిపతి స్వరూ­పానందేంద్ర సరస్వతి, రాష్ట్ర డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వామిని దర్శించుకున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీభ్రమరాంబామల్లి­కార్జు­న స్వామి వార్లకు ప్రత్యేక ఉత్సవం, రావణ వాహనసేవ వైభవంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో సోమవారం నిర్వహించిన గిరి ప్రదక్షిణతో నీలాచలం గిరు­లు పులకించాయి. సీతారామలక్ష్మణుల ఉత్సవ మూర్తుల ఊరేగింపులో సుమారు పదివేల మంది భక్తులు పాల్గొని శ్రీరామనామాన్ని స్మరిస్తూ నీలాచలం చుట్టూ ప్రదక్షిణ చేశారు. 

మరిన్ని వార్తలు