Thunderbolt: పిడుగుల భయం.. వజ్రపాత్‌ యాప్‌తో అభయం

14 Jul, 2021 12:24 IST|Sakshi

వర్షాకాలం ప్రారంభమవుతోందంటే ఒక్కపక్క సంతోషం..మరోపక్క భయం కూడా వెంటాడుతోంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. నీటి వనరులు చేకూరుతాయి. అయితే అదే సమయంలో పడే పిడుగులు ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంటున్న సందర్భాలున్నాయి. ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చునని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. పిడుగుల నుంచి తప్పించుకోవాలంటే వజ్రపాత్‌ యాప్‌ అందుబాటులో ఉంచుకుంటే సరిపోతుందంటున్నారు.    

సాక్షి,రాజాం: వర్షా కాలంలో ఏదో ఒక చోట పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. పొలాల్లో ఉండే రైతులు, ప్రయాణాల్లో ఉండేవారు పిడుగుపాటుకు గురై మృత్యుఒడిలోకి చేరుతున్నారు. మూగజీవాలు కూడా పిడుగులబారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఓ వైపు భారత ప్రభుత్వం టెక్నాలజీ ద్వారా మొబైల్‌ ఫోన్‌లకు టెక్ట్సు మెసేజ్‌లు పెడుతున్నా, హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ప్రమాదాలు తప్పడంలేదు. ఇలాంటి ఘటనల నుంచి గట్టెక్కాలంటే అరచేతిలో ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఉన్నవారందరూ వజ్రాయాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

జిల్లాలో ఏడాదికి 120 మందికిపైగా మృతి 
ప్రతీ ఏడాది జిల్లాలో సుమారు 120 మంది పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. పదుల సంఖ్యలో జీవాలు కూడా చనిపోతున్నాయి. రైతులే ఎక్కువ మంది పిడుగుపాటుకు గురౌతున్నారు. పిడుగుపాటుకు గురై మృతి చెందిన వారికి ప్రకృతి వైపరీత్యాల విభాగంలో రూ. 4 లక్షల నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అందించాల్సి ఉంది. పాక్షికంగా అంగవైకల్యం సంభవిస్తే రూ. 59 వేలు, 60 శాతం అంగవైకల్యం దాటితే రూ. 2 లక్షలు నష్టపరిహారం అందించాలి. అయితే సాయం అందడంలో ప్రస్తు తం జాప్యం జరుగుతుంది. వైఎస్సార్‌ బీమాలో ఉన్నవారికి మాత్రమే పరిహారం అందుతుంది.  

జాగ్రత్తలు తప్పనిసరి  
పిడుగు పడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. 
వర్షం, ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండరాదు.  
సురక్షిత ప్రాంతాలు వైపు వెళ్లిపోవాలి.  
పెద్దగా వచ్చే ఉరుముల శబ్దం వినబడగానే రెండు చెవులు మూసుకొని మొకాళ్లపై నిల్చోవాలి. 
పిడుగుపాటుకు గురైన వ్యక్తిని ప్రాథమికి చికిత్సలో భాగంగా సంఘటనా స్థలం నుంచి తీసుకొచ్చి ఊపిరి అందించే ఏర్పాటు చేయాలి.  
చేతులు, కాలిని గట్టిగా చేతులతో రాపిడి చేయడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు.  
వర్షం పడే సమయంలో మూగజీవాలను సురక్షితమైన షెడ్లలో మాత్రమే ఉంచాలి.

                                                            వజ్రపాత్‌ యాప్‌   
యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా.. 
ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఉన్నవారంతా ప్లేస్టోర్‌లో వజ్రపాత్‌ యాప్‌ని డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ ఓపెన్‌ చేయగానే భాష అడుగుతుంది. అనంతరం మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలి. ఆ నంబర్‌ ఆధారంగా లొకేషన్‌ను చూపించి ఎరుపు, ఆరెంజ్, పసుపు రంగులతో కూడిన వలయాలు వస్తాయి. ఈ వలయాలులో అంకెలు కనిపిస్తాయి. వాటి ఆధారంగా ఎంత సేపట్లో పిడుగుపడే అవకాశం ఉందో సమాచారం వస్తోంది. సురక్షిత ప్రాంతాన్ని చూపిస్తుంది. పిడుగులు పడే ప్రమాదం లేకుంటే ఆ విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అంతేకాకుండా మరో వైపు ఉన్న ఆప్షన్‌లో పిడుగు ఎప్పుడు పడుతుందో అనే విషయాన్ని కూడా సూచిస్తుంది. ఈ యాప్‌ ద్వారా చుట్టుపక్కల ఉన్నవారిని కూడా అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు