చంద్రబాబు తీరుపై మండిపడ్డ వల్లభనేని వంశీ

22 Jan, 2021 15:35 IST|Sakshi

విజయవాడ: రాష్ట్రంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టడమే అజెండాగా పెట్టుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. బీజేపీ ఎక్కడ బలపడుతుందోనన్న అనుమానంతో చంద్రబాబే మత రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. బీజేపీకి భయపడే చంద్రబాబు హిందూ అజెండాని ఎత్తుకున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ, బీజేపీలను నమ్మే పరిస్థితి లేదని ఆయన వివరించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్పుకునే చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంటే, హడావిడిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని వంశీ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఒక నెల ఆలస్యం అయితే నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు. స్వలాభం కోసం రాజ్యాంగం ప్రస్థావన తెచ్చే చంద్రబాబు.. ఏ రాజ్యాంగం ప్రకారం కరకట్టపై అక్రమ కట్టడాన్ని నిర్మించుకొని నివాసముంటున్నారని నిలదీశారు. ఎన్నికలంటే చంద్రబాబుకి భయం కాబట్టే తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికలో పోటీ చేయలేదని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీసం ప్రచారం చేసే సాహసం కూడా చేయలేని చంద్రబాబు తమది జాతీయ పార్టీ అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అబద్దాన్ని పదే పదే చెప్తే నిజం అవుతుందనే సిద్ధాంతాన్ని చంద్రబాబు నమ్ముతాడని ఆయన ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు