గనుల వేలానికి హైపవర్‌ కమిటీ ఆమోదం

16 Dec, 2021 03:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: బంగారం, వజ్రాలు సహా 22 అత్యంత విలువైన గనుల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో బుధవారం మైనింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో జరిగిన హైపవర్‌ కమిటీ సమావేశంలో వేలానికి ఆమోదముద్ర వేశారు. సమావేశంలో మైనింగ్‌ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి పాల్గొనగా, ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైనింగ్‌ రీజినల్‌ కంట్రోలర్‌ శైలేంద్రకుమార్, జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సదరన్‌ రీజియన్‌ డైరెక్టర్‌ ప్రసూన్‌ఘోష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

జీఎస్‌ఐ ప్రతిపాదించిన 9, రాష్ట్ర మైనింగ్‌ శాఖ ధ్రువీకరించిన 13 గనుల వేలానికి సంబంధించిన విధివిధానాలను కమిటీలో ఖరారు చేశారు. ప్రీమియం, రిజర్వు ధరలు, వేలం నిర్వహణపై మార్గదర్శకాలు నిర్దేశించారు. వీటి ప్రకారం 22 గనులకు వేలం నిర్వహించాలని మైనింగ్‌ శాఖకు స్పష్టం చేసింది. 21 గనులకు కాంపోజిట్‌ లీజులు, ఒక గనికి సాధారణ లీజు ఇచ్చేందుకు అంగీకరించింది. కమిటీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని మైనింగ్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు