Varadapuram Suri: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!

2 Jun, 2022 16:46 IST|Sakshi

అనంతపురంలో రూ.129 కోట్ల విలువైన భూమిని కాజేసిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం  

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని విచారణలో తేలినా చర్యల్లేవ్‌ 

సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేసి చేతులు దులిపేసుకున్న వైనం 

ఇప్పటికీ నివేదిక సమర్పించని ఉన్నతాధికారుల కమిటీ 

అసాధారణ జాప్యంపై అనుమానాలెన్నో..  

ఆయనో ‘భూ’చోడు. ఫోర్జరీలు చేయడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య. వాటి ఆధారంగా భూదందాలకు పాల్పడి రూ.కోట్లకు పడగలెత్తాడు. ఆయన అక్రమాలు అధికారిక విచారణల్లోనూ వెల్లడయ్యాయి. అయినా చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. ఆయన పట్ల అధికారులు ఎందుకింత ప్రేమ కనబరుస్తున్నారో ఎవరికీ అంతుపట్టని విషయం.   

సాక్షి, పుట్టపర్తి: అనంతపురం కలెక్టర్‌ కార్యాలయం నుంచి జేఎన్‌టీయూకు వెళ్లే దారిలో నవోదయ కాలనీ 80 అడుగుల రోడ్డు పక్కనే ఉన్న 6.35 ఎకరాల భూమిని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వరదాపురం సూరి కాజేశారు. సుమారు రూ.129 కోట్ల విలువ చేసే ఈ భూమిని నకిలీ డాక్యుమెంట్లతో అత్యంత చాకచక్యంగా తన ఖాతాలో వేసుకున్నారు. అక్రమ పద్ధతుల్లో భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తేలినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌ మినహా క్రిమినల్‌ చర్యలు చేపట్టకుండా రిజిస్ట్రేషన్‌ అధికారులు తాత్సారం చేస్తుండగా...కలెక్టర్‌ నియమించిన ఉన్నతాధికారుల కమిటీ కూడా నివేదిక సమర్పణలో జాప్యం చేస్తోంది. 

మోసం చేశారిలా..  
రాళ్లపల్లి నారాయణప్ప అనే వ్యక్తి 1929లో అప్పటికే పింఛన్‌ తీసుకుంటున్న గుండూరావు నుంచి జేఎన్‌టీయూకు వెళ్లే దారిలోని సర్వే నంబర్‌ 301లో 7.77 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. నారాయణప్ప పెద్ద మనవడు పెద్ద ఉలిగప్పకు 1933లో హక్కు విడుదల చేశారు. ఆయన 1935లో బ్యాంకులో మార్ట్‌గేజ్‌ చేసి రుణం కూడా పొందారు. రాళ్లపల్లి నారాయణప్ప నుంచి తర్వాత నాలుగు తరాల వారికి భూమి మారుతూ వచ్చింది. అయితే, దొడ్డమనేని మాలతేష్‌ అనే వ్యక్తి గుండూరావు తన చిన్నాన్న అని పేర్కొంటూ నవంబర్‌ 19, 1985 తారీఖుతో అన్‌ రిజిస్టర్డ్‌ వీలునామా పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. వీటి ఆధారంగా 2018లో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై 301–3 సర్వే నంబరులో 6.35 ఎకరాల భూమిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు.

చదవండి: (శ్రీరస్తు.. కల్యాణమస్తు: 23 దాటితే డిసెంబర్‌ వరకు ఆగాల్సిందే!) 

అనంతరం డిసెంబర్‌ 23, 2021లో మాలతేష్‌ నుంచి 6.35 ఎకరాలను వరదాపురం సూరి కుమారుడు నితిన్‌ సాయి, ధర్మవరానికి చెందిన యంగలశెట్టిరాజు (సూరి అనుచరుడు) కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వాస్తవానికి గుండూరావు 1929 నాటికే ప్రభుత్వ పింఛన్‌ తీసుకుంటున్నారు. అంటే అప్పటికే ఆయనకు 60 ఏళ్లు పూర్తయి ఉంటాయి. దీన్నిబట్టి 1985 నాటికి గుండూరావు వయసు 116 ఏళ్లు! అంతటి వయస్సు ఉన్న వ్యక్తి అన్‌రిజిస్టర్డ్‌ వీలునామా ఎలా రాయిస్తారో అర్థం కాని విషయం.  ఈ అన్‌ రిజిస్టర్డ్‌ వీలునామా ఫోర్జరీ అని ఆర్డీఓ కోర్టు సైతం నిర్ధారించింది. అయినప్పటికీ వరదాపురం సూరి తన గ్రామానికే చెందిన సబ్‌రిజి్రస్టార్‌ను లోబర్చుకుని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయించారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెన్షన్‌తో సరి..  
బాధితుల ఫిర్యాదు మేరకు మూడు నెలల క్రితం విచారణ చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులు ఫోర్టరీ డాక్యుమెంట్లతో రిజి్రస్టేషన్‌ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యవహారంపై అనంతపురం సబ్‌ రిజిస్ట్రార్‌ హరికృష్ణను సస్పెండ్‌ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న నితిన్‌ సాయి, యంగలశెట్టి రాజు మీద క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ..జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటిదాకా నితిన్‌ సాయి, యంగలశెట్టి రాజా, అక్రమాల సూత్రధారి అయిన వరదాపురం సూరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయలేదు. వారి మీద కేసులు నమోదు చేయకుండా భారీ ఎత్తున ముడుపులు స్వీకరించారా? లేదా తప్పుదోవ పట్టించే ఎత్తుగడ వేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

చదవండి: (హిందూపురం వాసుల చిరకాల వాంఛ.. సాకారం చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం)

నివేదిక సమర్పించడంలోనూ జాప్యమే..  
సూరి చేసిన అక్రమ వ్యవహారంపై విచారణకు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) ఆధ్వర్యంలో హంద్రీ–నీవా సుజల స్రవంతి సబ్‌ కలెక్టర్, అనంతపురం మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సభ్యులుగా కలెక్టర్‌ నాగలక్ష్మి అప్పట్లోనే విచారణ కమిటీని నియమించారు. ఇందులో ఒక సభ్యుడు నివేదిక సమర్పించినా, మరొక సభ్యుడు మాత్రం కాలయాపన చేస్తున్నారు. ఇంతటి భారీ అక్రమ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సి ఉన్నా.. మరొక అధికారి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ  కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. ‘భూచోళ్ల’పై క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా చేయడానికే అధికారులందరూ కలిసి కొత్త నాటకాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. 

క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరాం 
అన్‌రిజిస్టర్డ్‌ వీలునామా ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయడం అనైతికమని పలువురు  ఫిర్యాదు చేశారు. రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేశాం. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని జిల్లా రిజి్రస్టార్‌కు ఉత్తర్వులు జారీ చేశాం.   
– మాధవి, డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌   

మరిన్ని వార్తలు