రాష్ట్రంలో అరుదైన పక్షి జాతులు.. నల్ల బాజా, గోధుమ రంగు గుడ్ల గూబ, ఎలుక గద్ద పక్షి

13 Mar, 2023 11:39 IST|Sakshi

రాష్ట్రంలో అడవి గుడ్లగూబ, ఎలుక గద్దలను గుర్తించిన బర్డ్‌ వాచర్స్‌ 

గ్రేట్‌ బ్యాక్‌ యార్డ్‌ బర్డ్‌ కౌంట్‌లో రికార్డయిన పలు రకాల పక్షులు   

దేశవ్యాప్తంగా 1,067 జాతులు.. రాష్ట్రంలో 313 జాతుల నమోదు  

గణనలో పాల్గొన్న పలు విద్యా సంస్థలు, డాక్టర్లు, సిటిజన్లు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు అరుదైన పక్షి జాతుల్ని బర్డ్‌ వాచర్స్‌ గుర్తించారు. గోధుమ రంగు అడవి గుడ్ల గూబ(బ్రౌన్‌ వుడ్‌ ఓల్‌), ఎలుక గద్ద(కామన్‌ బజార్డ్‌), నల్ల బాజా(బ్లాక్‌ బాజా) వంటి అరుదైన పక్షులు కనిపించాయి. తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌ విద్యార్థులు సుదీర్ఘకాలం తర్వాత నల్ల బాజాను గుర్తించగా, రాజమండ్రిలో బర్డ్‌ వాచర్‌ మోహన్‌ శ్రీకర్‌ గోధుమ రంగు అడవి గుడ్ల గూబను రికార్డు చేశారు. విజయవాడలో ఎలుక గద్ద పక్షి రాష్ట్రంలో రెండోసారి రికార్డయింది.

రాష్ట్ర వ్యాప్తంగా 8 రకాల గుడ్ల గూబలు రికార్డయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు 4 రోజులపాటు ఐఐఎస్‌ఈఆర్‌ ఆధ్వర్యంలో వరుసగా నాలుగో సంవత్సరం రాష్ట్రంలో గ్రేట్‌ బ్యాక్‌ యార్డ్‌ బర్డ్‌ కౌంట్‌గా పిలిచే ప్రపంచ పక్షుల గణన నిర్వహించారు. గణనలో దేశం వ్యాప్తంగా 1,067 జాతుల పక్షులు నమోదవగా, మన రాష్ట్రం 313 జాతుల్ని నమోదు చేసి దేశంలో 12వ స్థానంలో నిలిచింది. బర్డ్‌ వాచర్‌లు పక్షులను గమనించి వాటి ఫొటోలను సిటిజన్‌ సైన్స్‌ పోర్టల్‌ ఈబర్డ్‌లో నమోదు చేశారు. 

గణనలో 84 మంది బర్డ్‌ వాచర్స్‌..  
తిరుపతి ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ తిరుపతి, తిరుపతి రీజనల్‌ సైన్స్‌ సెంటర్, ఏలూరు సీఆర్‌ఆర్‌ మహిళా కళాశాల, విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్‌ సహా రాష్ట్రంలోని పలు క్యాంపస్‌లు ఈ గణనలో పాల్గొన్నాయి. 2013లో తొలిసారి రాష్ట్రంలో గ్రేట్‌ బ్యాక్‌ యార్డ్‌ బర్డ్‌ కౌంట్‌ జరగ్గా అప్పుడు 300కి పైగా జాతుల పక్షుల్ని నమోదు చేశారు. ఐఐఎస్‌ఈర్‌ తిరుపతి విద్యార్థులు, పరిశోధకులు ఈ గణనలో తిరుపతి పరిసరాల్లో 120 జాతుల పక్షుల్ని నమోదు చేయడం విశేషం.

విజయవాడ నేచర్‌ క్లబ్‌లో ఉన్న పలువురు వైద్యులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కొందరు సిటిజన్లు ఒక గ్రూపుగా ఏర్పడి విజయవాడ పరిసరాల్లో 60 రకాల పక్షులను నమోదు చేశారు. ఒంగోలుకు చెందిన ఇద్దరు వైద్యు­లు ప్రకాశం జిల్లా ప్రాంతంలో 100 జాతులకు పైగా పక్షుల్ని రికార్డు చేశారు. రాజమండ్రి బర్డ్‌ నేచర్‌ ఫోటోగ్రఫీ గ్రూపు సభ్యులుగా ఉన్న డాక్టర్లు, ప్రభు­త్వ ఉద్యోగులు తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల నుంచి 200 జా­తుల పక్షులను రికార్డు చేశారు.

విశాఖ­పట్నంలో స్థాని­క ఎన్జీఓలు డబుల్య్‌సీటీఆర్‌ఈ, ఈసీసీటీలు అటవీ శాఖతో కలిసి బర్డ్‌ వాక్‌లు నిర్వహించి 180 జాతుల పక్షులను నమోదు చేశారు. అనంతపురంలో 160 రకాల పక్షులు, కొల్లేరు పక్షుల అభయార­ణ్యం­లో 90 రకాల పక్షులు నమోదయ్యాయి. మొత్తం 84 మంది బర్డ్‌ వాచర్స్‌ ఈ గణనలో పాల్గొన్నారు. పక్షి శాస్త్రవేత్తలు, పరిశోధకులకంటె ఎక్కువగా సాధారణ ప్రజలు ఈ గణనలో పాల్గొనడం విశేషం.

65 శాతం పక్షులు నమోదయ్యాయి 
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 490 జాతుల పక్షులు రికార్డవగా.. ఈ గణనలో వాటిలో 65 శాతం పక్షులు నమోదయ్యాయి. ఎక్కువ మందిని ప్రకృతికి అనుసంధానం చేయడం, పక్షుల­ను చూడాలనే అభిరుచితో ఉన్న వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ గణన ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఫలితాలు ప్రాథమికంగా ఇచ్చినవే. కాగా, బర్డ్‌ కౌంట్‌ ఇండియా త్వరలో తుది ఫలితాలను వెల్లడిస్తుంది.  
– బండి రాజశేఖర్, ఐఐఎస్‌ఈఆర్‌ సిటిజన్‌ సైంటిస్ట్‌    

ప్రకాశం జిల్లాలో పక్షుల సమాచారాన్ని అన్వేషిస్తున్నాం.. 
నా సహోద్యోగి డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌(బర్డ్‌ వాచర్‌)తో కలిసి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పక్షుల్ని రికార్డు చేశాను. పెళ్లూరు సమీపంలోని గడ్డి భూముల్లో కొంగలు, పెలికాన్‌లు, పెయింటెడ్, ఓపెన్‌ బిల్‌ స్కార్ట్‌లను ఎక్కువగా గమనించాము. దర్శి సమీపంలో ఈజిప్టియన్‌ వల్చర్, హనీ బజార్డ్, బ్లాక్‌ కైట్‌ పక్షుల్ని నమోదు చేశాం. ప్రకాశం జిల్లాలోని పక్షుల గురించి మరింత సమాచారాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నాం. 
– డాక్టర్‌ రామాంజినాయక్, బర్డ్‌ వాచర్, ఒంగోలు

మరిన్ని వార్తలు