జాతీయ ఆదివాసీ దినోత్సవం: గిరిజన కళలకు 'కళ'

16 Nov, 2021 03:44 IST|Sakshi
గిరిజనులతో కలిసి నృత్యం చేస్తున్న గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ రంజిత్‌ బాషా, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశా

బిర్సా ముండా జయంతిని ‘జన్‌ జాతి గౌరవ దివస్‌’గా నిర్వహణ

గిరిజన కళలను ప్రోత్సహించేలా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పలు కార్యక్రమాలు

విశాఖ ఆర్కే బీచ్‌లో హస్తకళల ప్రదర్శన, గిరిజన కళాకారులకు డ్రాయింగ్, పెయింటింగ్‌ పోటీలు

సాక్షి, అమరావతి/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): గిరిజన కళలకు ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 146వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ‘జన్‌ జాతి గౌరవ దివస్‌’(జాతీయ ఆదివాసీ దినోత్సవం)గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 22 వరకు గిరిజన కళలను ప్రోత్సహించేలా కార్యాచరణ చేపట్టారు. దీనిలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్‌లో సోమవారం ప్రారంభించిన గిరిజన హస్తకళల ప్రదర్శన, విక్రయాలు 19 వరకు కొనసాగుతాయి.

సవర, కొండరెడ్డి, కొండదొర, నూకదొర, కోయ, జాతపు, కొండ కమ్మర, వాల్మీకి, భగతహ, కొటియా తదితర ఆదిమ గిరిజనులు రూపొందించిన హస్త కళలను ఐదు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. గిరిజన సంప్రదాయ, ప్రత్యేకత కలిగిన ఈ హస్తకళ నైపుణ్యాలను మరో తరానికి అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయి. గిరిజన హస్తకళాకారులకు జీవనోపాధి చూపడంతో పాటు.. సంప్రదాయ గిరిజన హస్తకళలను నిలబెట్టేందుకు 12 ప్రధాన రకాల ఉత్పత్తులతో గిరిజన సంక్షేమ శాఖ స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. మహోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ గిరిజన ప్రాంతాల నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా థింసా నృత్యం చేస్తున్న సమయంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ రంజిత్‌ బాషా, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశా కూడా నృత్యం చేశారు.  

డ్రాయింగ్, పెయింటింగ్‌ పోటీలు
రాష్ట్రంలోని గిరిజన కళాకారులను ప్రోత్సహించేలా ఈ నెల 18 వరకు డ్రాయింగ్, పెయింటింగ్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పర్యవేక్షణలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు ఈ నెల 21న రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి రూ.50 వేలు, రూ.25 వేలు, రూ.15 వేల చొప్పున ఈ నెల 22న జరిగే ముగింపు కార్యక్రమంలో బహుమతులను అందిస్తారు.  

గిరిజన పోరాట యోధుడు.. బిర్సా ముండా
ఆదివాసీల కోసం బ్రిటీష్‌ వారిపై వీరోచితంగా పోరాడిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి రోజైన నవంబర్‌ 15న ‘జన్‌ జాతి గౌరవ దివస్‌’గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 1875 నవంబర్‌ 15న రాంచీలో జన్మించిన బిర్సా ముండా 1900 జూన్‌ 9న రాంచీ సెంట్రల్‌ జైల్లోనే మరణించాడు. గిరిజన వ్యవసాయ పద్ధతులను, జీవన విధానాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడిన బ్రిటీష్‌ వారిపై పోరాటం చేశాడు. ఆయన స్ఫూర్తి భావితరాలకు అందించాలని కేంద్రం ఆయన జయంతిని జన్‌ జాతి గౌరవ దివస్‌గా నిర్వహిస్తోంది.   

మరిన్ని వార్తలు