వసంతవాడ విషాదంపై ఏపీ ప్రభుత్వం స్పందన

28 Oct, 2020 19:43 IST|Sakshi

వేలేరుపాడు ఏజెన్సీలో విషాదం

వాగులో మునిగిపోయిన ఆరుగురు విద్యార్థులు మృతి

చావులోనూ వీడని స్నేహితులు

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం వసంతవాడ వాగు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించింది. వసంతవాడ వద్ద వాగులో గల్లంతై ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద సంఘటనను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో మృతుని కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మంత్రి ఆళ్ల నాని ద్వారా ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ.18 లక్షలు అందజేయనుంది. మృతి చెందిన ఆరుగురు కూడా విద్యార్థులు, యువకులు కావడంతో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. (చ‌ద‌వండి: గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం)

చావులోనూ వీడని స్నేహితులు
ఒకే ఊరు. ఒకే వీధి. అందరూ దాదాపు ఒకే ఈడూ పిల్లలు. ఒకరు తొమ్మిదో తరగతి, ఒకరు పది , ఒకరు ఇంటర్మీడియట్. మొత్తం ఎనిమిది మంది స్నేహ బృందం. గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సంతర్పణ కాస్త విషాదంగా మారి గంగాధర వెంకటరావు, కర్నాటి రంజిత్, గొట్టి పర్తి మనోజ్, కునారపు రాధాకృష్ణ (16), కెల్లా భువన్ (18), శ్రీరాముల శివాజీ (18) వాగులో మునిగి చనిపోయిన ఘటనతో ఏజెన్సీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

అమ్మ‌వారి నిమ‌జ్జ‌నం తెల్లారే విషాదం
పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం వసంతవాడ వాడ వాగులో దిగి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యి మృత్యువాత పడ్డారు. దసరా ఉత్సవాల సందర్భంగా భుదేవిపేట గ్రామానికి చెందిన ఓ 15 కుటుంబాలు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు పూజలు నిర్వహించి నిన్న  నిమజ్జనం చేశారు. మరుసటి రోజు సంతర్పణ ఏర్పాటు చేసుకోవడం వీరి ఆచారం. ఈ నేపథ్యంలో ముగింపు వేడుకల అనంతరం వసంతవాడ వాగు వద్ద బుధవారం వన సంతర్పణ ఏర్పాటు చేసుకున్న క్రమంలో స్నేహితులంతా కలిసి వంట సామాన్లు తీసుకు వచ్చారు. 

ఈ  ఆరుగురు స్నేహితులు వాగు దాటి బహిర్భూమికి వెళ్లి వచ్చే క్రమంలో ప్రవాహంలో మునిగిపోయి వాగులో మునిగి మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు ఆడుతూ నీళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో ఒకరు మునిగిపోగా మిత్రుణ్ణి కాపాడే క్రమంలో ఒక్కొక్కరు మునిగిపోయారు. 'వారిని కాపాడటానికి వాగులో దిగాను అందరూ ఒకేసారి నన్ను పట్టుకునేసరికి ఊపిరాడక ఒడ్డుకి వచ్చేసా..ఒక్కరినీ కూడా కాపాడలేకపోయాను' అని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. విహారానికి వచ్చి మృత్యువాత పడటం విచారకరమని, మృతుల కుటుంబాలన్ని నిరుపేద జీవితాలని, బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు.

మరిన్ని వార్తలు