-

జ్యోత్స్న అను నేను..

21 Nov, 2020 05:00 IST|Sakshi
మహిళా కమిషన్‌కు ఒకరోజు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన జ్యోత్స్న, చిత్రంలో వాసిరెడ్డి పద్మ

మహిళా కమిషన్‌ ఒకరోజు చైర్‌పర్సన్, సభ్యులుగా కిశోర బాలికలు

బాలికల కలల్ని నిజం చేస్తాం : వాసిరెడ్డి పద్మ

నెహ్రూ నగర్‌ (గుంటూరు): ‘జ్యోత్స్న అను నేను మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తాను. మహిళా చట్టాలపై వారికి అవగాహన కల్పిస్తాను. మహిళా కమిషన్‌ ద్వారా ఆడ పిల్లలకు, మహిళలకు ధైర్యం కల్పిస్తాను’ అని జాతీయ విలువిద్య క్రీడాకారిణి కె.జ్యోత్స్న అన్నారు. ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిల్లల హక్కులపై అవగాహన కల్పించేందుకు ‘పిల్లల కోసం.. పిల్లల యొక్క.. పిల్లల చేత’ అనే ఇతివృత్తంతో యునిసెఫ్, మహితా ఆర్గనైజేషన్, అలయన్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ రైట్స్, మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో కిశోర బాలికలు శుక్రవారం ఒకరోజు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా విధులు నిర్వర్తించారు.

ఈ సందర్భంగా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. బాలికలు కన్న కలల్ని నిజం చేయడానికి, వారికి భవిష్యత్‌పై భరోసా కల్పించడానికి మహిళా కమిషన్‌ అన్నివిధాలుగా తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో ఆడ పిల్లలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని జాగృతులను చేస్తున్నట్టు చెప్పారు. అనాథ ఆశ్రమంలో ఉంటూ నైపుణ్యాలు పెంపొందించుకుంటున్న బాలికలకు ఒకరోజు చైర్‌పర్సన్, కమిషన్‌ సభ్యులుగా విధులు నిర్వర్తించే అవకాశం కల్పించటం ఆనందాన్నిచ్చిందన్నారు. మహిళా కమిషన్‌ ఒకరోజు సభ్యులుగా నైని సుచరిత, కె.ఎస్తేరురాణి, ఎ.సిరివెన్నెల వ్యవహరించారు. 

మరిన్ని వార్తలు