వారిపై కఠిన చర్యలు తీసుకోండి

15 Sep, 2022 06:20 IST|Sakshi
డీజీపీకి ఫిర్యాదు చేస్తున్న వాసిరెడ్డి పద్మ

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్‌ భారతిపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ డీజీపీని కోరారు. ఆమె బుధవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు.

వైఎస్‌ భారతి గతంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ నిందాపూర్వకంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నవారు, యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆ పోస్టులను సోషల్‌ మీడియా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పద్మ విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్‌ మీడియా  వైఎస్‌ భారతిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పారిశ్రామికవేత్త, సామాజిక సేవాతత్పరురాలు భారతిపై దుష్ప్రచారం చేయడాన్ని యావత్‌ సమాజం ఖండిస్తోందన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు.  మహిళలను అడ్డంపెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే ఎవరికైనా కఠినమైన సంకేతాలు పంపాల్సిన అవసరం ఉన్నందునే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు