అమ్మా.. నేనున్నాను..

8 Jan, 2021 07:42 IST|Sakshi
ప్రియాంకకు ధైర్యం చెబుతున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌

సాక్షి, పాతపోస్టాఫీసు(విశాఖపట్నం): ప్రేమోన్మాది దాడిలో గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్న వలంటీర్‌ ప్రియాంకకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ భరోసా ఇచ్చారు.అమ్మా...నీ శ్రేయస్సుకు ప్రభుత్వంతో పాటు నేను అండగా ఉన్నాం అని ఓదార్చారు. పాతనగరం 25వ వార్డు పరిధి కన్వేయర్‌ బెల్టు కింద నివాసం ఉంటున్న ప్రియాంక ఇంటికి గురువారం ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రియాంక గొంతు నయమయ్యేలా హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీఇచ్చారు.

ప్రియాంక ఎదుటే ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్‌తో మాట్లాడి త్వరితగతిన మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు రూ.20వేల నగదు వాసుపల్లి అందజేశారు. తమ కుమార్తెకు మెరుగైన వైద్యం అందుతుందంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటూ ఎమ్మెల్యే వాసుపల్లి చొరవే కారణమని ప్రియాంక తల్లి రవణమ్మ చెప్పారు. కార్యక్రమంలో 39వ వార్డు అధ్యక్షుడు సూరాడ తాతారావు, కార్పొరేటర్‌ అభ్యర్థి కొల్లి సింహాచలం, ముస్లిం మైనార్టీ నాయకుడు మహ్మద్‌ సాధిక్, బాబ్జి, 38వ వార్డు అధ్యక్షుడు సన్యాసిరావు, మాధురి  పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు