కోతకు గురైన ప్రాంతం పూడ్చటంపై స్పష్టత

18 May, 2022 04:07 IST|Sakshi
పోలవరంపై ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం

పోలవరం ప్రాజెక్టు డిజైన్లపై కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో సుదీర్ఘ సమావేశం

ఇసుక నాణ్యతసహా 11 రకాల పరీక్షలు చేసి, జూలై 15లోగా సీడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు ఆదేశం

వాటిని పరిశీలించి జూలై 31లోగా హైడ్రాలిక్‌ శాండ్‌ ఫిల్లింగ్‌ లేదా డ్రెడ్జింగ్‌ ద్వారా గోతులు పూడ్చాలా అన్నదానిపై నిర్ణయం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరద ఉధృతికి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని మంగళవారం కేంద్ర జల్‌శక్తి శాఖ దాదాపుగా ఖరారు చేసింది. ఇసుక నాణ్యతతోసహా 11 రకాల పరీక్షలు చేసి జూలై 15లోగా కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీకి) నివేదిక ఇస్తే.. జూలై 31లోగా హైడ్రాలిక్‌ శాండ్‌ ఫిల్లింగ్‌ (కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను పొరలుపొరలుగా పోస్తూ వైబ్రో కాంపాక్షన్‌ చేయడం) లేదా డ్రెడ్జింగ్‌ (ఇసుకను తవ్వుతూ కోతకు గురైన ప్రాంతంలోకి ప్రత్యేక పైప్‌లైన్‌ ద్వారా పోసి.. వైబ్రో కాంపాక్షన్‌ చేయడం) ద్వారా కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలా అన్నది నిర్ణయిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం చెప్పారు. దానికి అనుగుణంగా ఆగస్టులోగా డిజైన్లు ఇస్తే.. సెప్టెంబర్‌లోగా ఆమోదిస్తామని తెలిపారు.

అక్టోబర్‌ 1 నుంచి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఖరారు చేయడంపై కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) పునాది డయాఫ్రమ్‌ వాల్‌ నాణ్యతపై పూర్తిస్థాయిలో పరీక్షలు చేశాక కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలా? లేక దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అదనంగా చేపట్టాల్సిన ఈ పనులకు అయ్యే వ్యయాన్ని మంజూరు చేయడంపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌తో చర్చిస్తానని, బుధవారం నిర్వహించే సమావేశంలో దీనిపై స్పష్టత ఇస్తామని తెలిపారు. ఈనెల 22న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అడ్డంకులను అధిగమించే మార్గాలను అన్వేషిస్తానని చెప్పారు. 

డీవాటరింగ్‌కు నో
ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన నిల్వ ఉన్న నీటిని తోడివేసి (డీవాటరింగ్‌).. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతంలో(–12 మీటర్ల నుంచి +15 మీటర్ల వరకు) ఇసుకను పొరలుపొరలుగా పోస్తూ.. వైబ్రో కాంపాక్షన్‌ చేయడం ద్వారా యథాస్థితికి తెచ్చే విధానంలో పనులు చేయాలంటే రూ.3,200 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర అధికారులు తెలిపారు.

ఆ విధానం ప్రకారం పనులు చేయడం కష్టమని సమావేశం నిర్ణయించింది. నిల్వ ఉన్న నీటిలోనే.. కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను పొరలుపొరలుగా పోస్తూ.. వైబ్రో కాంపాక్షన్‌ చేయడం(హైడ్రాలిక్‌ ఫిల్లింగ్‌), పురుషోత్తపట్నం వద్ద డ్రెజ్జింగ్‌ చేస్తూ అందులో నుంచి వచ్చే ఇసుకను ప్రత్యేక పైపులైన్‌ ద్వారా కోతకు గురైన ప్రాంతంలో పోసి, వైబ్రో కాంపాక్షన్‌ చేయడం ద్వారా పూడ్చే విధానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇసుక నాణ్యతసహా 11 రకాల పరీక్షలు చేశాక.. అందులో ఏ విధానంపై పనులు చేయాలన్నది తేల్చాలని సమావేశం నిర్ణయించింది.

డయాఫ్రమ్‌ వాల్‌పై ఎలా?
ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ను సగటున –30 మీటర్ల నుంచి –90 మీటర్ల లోతు నుంచి నిర్మించారు. గోదావరి వరద ఉధృతికి డయాఫ్రమ్‌ వాల్‌ ఏ మేరకు దెబ్బతింది? ఏ మేరకు పటిష్ఠంగా ఉంది? అన్నది తేల్చడానికి శాస్త్రీయమైన పరీక్ష ఏదీలేదని నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు చెప్పారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే డిజైన్ల తయారీకి రెండునెలల సమయం ఉందని, ఆలోగా డయాఫ్రమ్‌ వాల్‌ నాణ్యతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని వెదిరె శ్రీరాం అధికారులను ఆదేశించారు.

ఆ అధ్యయనం ఆధారంగా కొత్తగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలా? ఇప్పుడున్న డయాఫ్రమ్‌ వాల్‌లో దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలా? అన్నది నిర్ణయిస్తామని చెప్పారు. ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.కె.గుప్తా, సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ, పీపీఏ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, సీఎస్‌ఆర్‌ఎంస్‌ అధికారులు, ఢిల్లీ, చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.

నిధుల మంజూరుపై నేడు సమావేశం
పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తిచేయడానికి, అదనంగా చేపట్టాల్సిన పనులకు అవసరమైన నిధుల మంజూరుపై బుధవారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నిధుల మంజూరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు