ప్రేమికులను కలిపిన సమరం

4 Apr, 2022 22:36 IST|Sakshi
ప్రత్యేక అలంకారంలో వీరభద్ర స్వామి, కాళికాదేవి

కైరుప్పలలో కొనసాగిన సంప్రదాయ ఆచారం

రెండు వర్గాలుగా విడిపోయి నుగ్గులతో కొట్టుకున్న భక్తులు

ఆస్పరి: భక్తుల్లో భక్తి భావం ఉప్పొంగింది.. నుగ్గులు గాల్లోకి ఎగిరాయి. దుమ్ము ఆకాశాన్నంటింది.. పిడకల సమరం హోరాహోరీగా సాగింది. స్వామి అమ్మవార్ల ప్రేమను గెలిపించేందుకు భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి తలపడిన దృశ్యాలు యుద్ధాన్ని తలపించాయి. కైరుప్పల గ్రామంలో దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయ ఆచారాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించారు.

వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన పిడకల సమరాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలిరావడంతో కైరుప్పల కిటకిటలాడింది. ఆచారం ప్రకారం మండలంలోని కారుమంచి గ్రామానికి చెందిన పెద్ద రెడ్డి వంశస్తుడు నరసింహారెడ్డి మంది మార్భలం, తప్పెట్లు, మేళతాళాలతో గుర్రంపై కైరుప్పలకు చేరుకుని వీరభద్రస్వామిని దర్శించుకుని వెనుతిరిగిన వెంటనే పిడకల సమరం మొదలైంది.

గ్రామంలో భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. గాల్లోకి పిడకలు లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే అందరిలోనూ ఉత్సాహం ఉరకలు వేసింది. తమ వర్గం గెలవాలనే తపనతో మహిళలు పురుషులకు పిడకలు అందిస్తున్న తీరు ఆకట్టుకుంది. పిడకలు అయిపోయేంత వరకు ఈ పోరు కొనసాగింది. రెండు వర్గాల వారికి చెందిన 50 మంది స్పల్పంగా గాయపడగా, వారంతా స్వామి వారి బండారాన్ని పూసుకున్నారు.

అర గంట పాటు జరిగిన పిడకల పోరుతో గ్రామంలో దుమ్ము ధూళి ఆకాశన్నంటింది. ప్రేమ వ్యవహరంలో వీరభద్రస్వామి, కాళికాదేవిల మధ్య ఏర్పడిన విభేదాలే  ఈ సమరానికి కారణమని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ నెల 6వ తేదీన స్వామి, అమ్మవార్ల కల్యాణం, రథోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి రమేష్, సర్పంచ్‌ తిమ్మక్క గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు.

మరిన్ని వార్తలు