డీజిల్‌ కోసం వాహనాల అపహరణ 

2 Jan, 2022 04:21 IST|Sakshi
భవానీపురంలోని లారీ స్టాండ్‌ (ఇన్‌సెట్‌లో) డీజిల్‌ దొంగ వెంకటరెడ్డి

ఏకంగా ఆరు లారీలు, కాలేజీ బస్సు చోరీ  

జీపీఎస్‌ ద్వారా దొంగ గుట్టు రట్టు 

భవానీపురం(విజయవాడ పశ్చిమ): భారీ వాహనాల్లోని డీజిల్‌ దొంగిలించేందుకు ఏకంగా ఆరు లారీలు, ఒక కాలేజీ బస్‌ను చోరీ చేసిన నిందితుడిని, డీజిల్‌ కొనుగోలు చేసే వ్యక్తిని విజయవాడ భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం భవానీపురం ఐరన్‌ యార్డ్‌లోని ఒక లారీని ఎత్తుకుపోగా..దానికి ఏర్పాటు చేసిన జీపీఎస్‌ ద్వారా డీజిల్‌ అమ్ముతున్న దొంగ గుట్టు రట్టయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన వరుస లారీ దొంగతనాలపై భవానీపురం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు అందింది. భవానీపురంలో నివసించే ఆటో డ్రైవర్‌ వెంకటరెడ్డి హాల్టింగ్‌ డ్రైవర్‌గా లారీ, బస్, కారు తోలేవాడు.

మద్యం ఇతర దుర్వ్యసనాలకు బానిస అయిన అతను దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. తద్వారా వచ్చే డబ్బుతో జల్సా చేయడం మొదలు పెట్టాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అతన్ని దూరంగా పెట్టారు. ఈ క్రమంలోనే భవానీపురంలోని లారీ స్టాండ్‌పై పూర్తి అవగాహన ఉన్న అతను గత నెల 15వ తేదీ తరువాత స్టాండ్‌లో పార్క్‌ చేసి ఉన్న లారీని ఎత్తుకు పోయాడు. రెండు మూడు రోజులు గడిచిన తరువాత మరో లారీ, ఆ తరువాత మరో లారీ చోరీ చేశాడు. ఈ దొంగతనాలన్నీ పట్టపగలే జరగడం గమనార్హం.

అదే విధంగా లారీ స్టాండ్‌కు కూతవేటు దూరంలో పార్క్‌ చేసి ఉంచిన ఎన్‌ఆర్‌ఐ కాలేజీ బస్‌ను ఎత్తుకు పోయాడు. వరుస దొంగతనాలతో స్టాండ్‌లో అలజడి మొదలు కావడంతో ఇక అక్కడ క్షేమం కాదనుకున్నాడో ఏమో డీజిల్‌ దొంగ భవానీపురం ఐరన్‌ యార్డ్‌పై దృష్టి పెట్టి, మూడు లారీలను చోరీ చేశాడు. అందులో యార్డ్‌లో సాయినాథ్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన పార్శిల్‌ లారీ ఒకటి. దానిని ఎత్తుకుపోవడంతో సంబంధిత వ్యక్తులు అప్రమత్తమయ్యారు.

ఆ లారీకి ఉన్న జీపీఎస్‌ ద్వారా లారీ గన్నవరం మండలం ముస్తాబాదలోని ఒక రేకుల షెడ్‌ ముందు ఉండటాన్ని గుర్తించారు. లోపలకు వెళ్లి చూడగా దొంగిలించిన డీజిల్‌ను కొనుగోలు చేసే వ్యక్తి దొరికాడు. అతన్ని నిలదీయటంతో డీజిల్‌ దొంగ పట్టుబడ్డాడు. ఇద్దర్నీ పట్టుకుని గన్నవరం పోలీసులకు అప్పగించారు. చోరీకి గురైన లారీల్లో ఒకటి గన్నవరం మండలం కేసరపల్లి రోడ్డు మీద, మరో రెండు రామవరప్పాడు బైపాస్‌లో, ఎన్‌ఆర్‌ఐ కాలేజీ బస్‌ విద్యాధరపురం రామరాజ్యనగర్‌ రైలు కట్ట వద్ద దొరికాయి. ఈ ఘటనకు సంబంధించి భవానీపురం పీఎస్‌లో శనివారం కేసు నమోదైంది.   

మరిన్ని వార్తలు