ఇరవై నెలలుగా.. కలుగులోనే వెలగపూడి 

27 Dec, 2020 14:12 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రకృతిగీసిన ఛాయాచిత్రంలా ఉండే అందమైన ప్రశాంత విశాఖపట్నంపై కొన్నేళ్లుగా విషం చిమ్ముతూ వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తాజాగా ’ప్రమాణాల’ వ్యవహారంలోనూ తనదైన అతి తెలివి మార్కునే ప్రయోగిస్తున్నారు. విశాఖ నగరంలోనూ నేరసంస్కృతి పెచ్చుమీరేందుకు, రౌడీయిజం వేళ్లూనుకునేందుకు బీజం వేసిన వెలగపూడి ఇప్పుడు శుద్దపూసలా మాట్లాడటం చూసి రాజకీయ విశ్లేషకులు విస్తుపోతున్నారు. ఒక్కసారి అతని వివాదాస్పద నేరమయ రాజకీయం పరిశీలిస్తే.. విజయవాడలోని ఏలూరు రోడ్డులో 30 ఏళ్ల కిందట బతుకునీడ్చేందుకు రాగమాలిక ఆడియో షాపులో క్యాసెట్‌లు అద్దెకిచ్చే పని వెలగపూడిది.

ఇదంతా పగలు.. రాత్రిళ్లు అదే షాపును అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా చేసేవాడు. దేవినేని మురళి అనుచరగణంలో ఉంటూ 1986 డిసెంబర్‌ 26న ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా హత్య కేసులో నిందితుడయ్యాడు. జైలు పాలయ్యాడు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత..  క్యాసెట్‌ దుకాణమే కాదు.. బెజవాడ కూడా వదిలేసి.. సరిగ్గా చెప్పాలంటే  పారిపోయి విశాఖకు వలసొచ్చాడు. తొలుత ఎంవీపీకాలనీ సెక్టార్‌–6లోని బిల్డింగ్‌లో టెలెక్స్‌ పేపర్లు తయారుచేసే ఓ వ్యాపారి వద్ద తలదాచుకున్నాడు. ఆ తర్వాత ఓ దినపత్రిక అడ్వర్‌టైజ్‌మెంట్‌ సంస్థలో చిన్న గుమాస్తా ఉద్యోగం చేశారు. అటు తర్వాత  షిర్డీ సాయి స్కీం ఫైనాన్స్‌ కంపెనీ పెట్టి ఇట్టే బోర్డు తిప్పేశాడు. 

మీసాలోడు అలియాస్‌ మద్యం రామకృష్ణ 
అటు తర్వాత మద్యం సిండికేట్‌ వైపు దృష్టిసారించి.. అప్పటివరకు ఉన్న ఓ సిండికేట్‌ వ్యాపారులను టెండర్లు వేయొద్దంటూ బెదిరించి దౌర్జన్యం చేయించారు. దీంతో అప్పట్లో త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ తెరిచేందుకు అంతా సిద్ధం చేశారు. ఇక రౌడీరాజకీయం తెలియని విశాఖ నగరానికి విజయవాడ రౌడీలు, గూండాలను అతిథులుగా తీసుకొచ్చి కబడ్డీ పోటీలు, విశాఖ సంస్కృతికి సంబంధం లేని కోడిపందేల పోటీలు నిర్వహించారు. 

ఎమ్మెల్యే గిరితో అరాచక ప్రస్థానం 
ఇక సరిగ్గా 2009లో విశాఖ తూర్పు నుంచి టీడీపీ తరఫున అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యాడు. అక్కడి నుంచి మొదలు అతని అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. టీడీపీలోనే ఉంటూ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లోని ఓ మంత్రి అండతో వుడా భూములను అప్పనంగా కొట్టేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రుషికొండలో పోరంబోకు భూముల దురాక్రమణ, రోడ్డు విస్తరణలో స్థలం పోయిందని వుడా అధికారులను బెదిరించి రుషికొండ లేఔట్‌లో రెండు ప్లాట్లను అప్పనంగా కొట్టేయడం.. ప్రతిష్టాత్మక ఏయూలో వర్గ రాజకీయాలు జొప్పించికలుషితం చేయడం, ఆరిలోవ ప్రాంతంలో వెలగపూడి యువసేన పేరిట దందాలు, దౌర్జన్యాలు.. హంతకులు, నేరస్తులకు అండగా ఉండటం..  ఇలా చెప్పుకుంటూ వెలగపూడి నేరచరితకు కొదవేలేదు. ఇక ఎడ్యుకేషన్‌ సిటీగా వెలిగిన విశాఖ నగరాన్ని ఎడిక్షన్‌ సిటీగా మార్చేసింది ఎవరంటే.. టీడీపీ నేతలు కూడా వెలగపూడి రామకృష్ణ పేరే చెబుతారు. 

రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడే..
రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడే.. ఇందులో అనుమానం లేదు.. వాస్తవాలు ఎవరు తొక్కిపెట్టగలరు.. అని దివంగత వంగవీటి మోహన రంగాకు అత్యంత సన్నిహితుడు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. 

ఇరవై నెలలుగా.. కలుగులోనే వెలగపూడి 
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన దరిమిలా వెలగపూడి అక్రమాలకు చెక్‌పడింది. తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి బ్యాచ్‌ దందాలు, దౌర్జన్యాలు ఆగిపోయాయి. కోడి పందేల ఊసే లేకుండా పోయింది. బినామీ ముసుగులో లిక్కర్‌ మాఫియా ఆగడాలకు బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా తెర వెనక్కి వెళ్లిన వెలగపూడి తన భూదందాలపై ఉక్కుపాదం పడటంతో ఉక్కిరి బిక్కిరై బయటకు వచ్చి ప్రమాణాల రాజకీయానికి తెరలేపారు.తానేమీ తప్పు చేయలేదని, రంగా హత్య కేసుకు తనకు సంబంధం లేదని, ఈ విషయమై రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సమక్షంలో సాయిబాబా సన్నిధిలో తాను ప్రమాణం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 

నీకు సాయిరెడ్డి స్థాయి లేదు: వంశీకృష్ణ శ్రీనివాస్‌ 
తమ నాయకుడు విజయసాయిరెడ్డి గురించి మాట్లాడే స్థాయి వెలగపూడికి లేదని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ అన్నారు. ’’ అసలు నువ్వు విశాఖ ఎందుకు వలసొచ్చావ్‌..? రంగా హత్య కేసుతో సంబంధం ఉందా లేదా... ?.  కోర్టు కొట్టేసిన ఆ కేసులో నిందితుడిగా పేరుందా లేదా? .. ఆ హత్య కేసులో నిందితుడిగా జైలు జీవితం గడిపావా లేదా.? ..విశాఖలో కూడా గతంలో కేసులు ఉన్నాయా లేవా..? ’’ ముందు వెలగపూడి వీటికి సమాధానం చెప్పాలని వంశీకృష్ణ యాదవ్‌ సవాల్‌ విసిరారు.

మరిన్ని వార్తలు