‘దీవెన’తో భవిత దేదీప్యం

30 Jul, 2021 08:28 IST|Sakshi

రెండో విడత జగనన్న విద్యా దీవెన నగదు విడుదల

జిల్లాలో 93,189 మందికి రూ.  68.14 కోట్లు జమ

సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి వెలంపల్లి, కలెక్టర్‌ నివాస్, ఎమ్మెల్యేలు

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): మన పిల్లలకు విద్యే మనం ఇచ్చే ఆస్తి.. దాని కోసం ఎంతైనా ఖర్చు పెడతాం.. అంటూ హామీనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దానిని కార్యరూపంలో చేసిచూపుతున్నారు. వరుసగా రెండో ఏడాది జగనన్న విద్యా దీవెన నగదు విడుదల చేసి వారి ఉజ్వల భవితకు నాంది పలికారు. గురువారం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా మంజూరైన నగదును కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. స్థానిక కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ పాల్గొన్నారు. 

విద్యా విప్లవం కొనసాగుతుంది.. 
మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ విద్య ద్వారానే సమజాభివృద్ధి సాధ్యమని గుర్తించి విద్య విధానంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి ఆదర్శంగా నిలిచారన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నాడు–నేడు పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఢిల్లీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు ఈ పథకం అమలు తీరును అధ్యయనం చేస్తున్నాయన్నారు. ఇది మనందరికీ గర్వకారణమన్నారు. 

రూ. 68.14 కోట్లు జమ.. 
జిల్లాలో జగనన్న విద్యాదీవెన రెండో విడత కింద 93,189 మంది విద్యార్థులకు చెందిన 82,107 మంది తల్లుల ఖాతాలో రూ.68.14 కోట్లు జమచేసినట్లు కలెక్టర్‌ జె. నివాస్‌ తెలిపారు. అనంతరం దీనికి సంబంధించిన చెక్‌ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా, ఎమ్మెల్యేలు కె.పార్థసారథి, కె.రక్షణనిధి, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) కె.మోహన్‌ కుమార్, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి సరస్వతి పాల్గొన్నారు. 

బాగా చదువుకుంటా.. 
సిద్ధార్థ డిగ్రీ కళాశాలో డిగ్రీ సెకండీయర్‌ చదువుతున్నాను. జగనన్న విద్యాదీవెనతో ఎంతో మంది పేదలు చదువుకుంటున్నారు. జగనన్న అందిస్తున్న ఆర్థిక సహాయం మా తల్లిదంద్రులు అప్పులు చేయకుండా వెసులుబాటు కల్పిస్తోంది. మేం బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి, మంచి పేరు తెస్తాం.  
– భావన, డిగ్రీ విద్యార్థిని, విజయవాడ 

దీవెనతోనే చదువు కొనసాగిస్తున్నా..
విద్యాదీవెన నా చదువుకు సాయ పడుతోంది. పాలిటెక్నిక్‌ చదివాను.. ఆర్థిక ఇబ్బందులు, స్కాలర్‌షిప్‌ లేకపోవడం వల్ల ఉన్నత చదువులు చదవలేకపోయాను. వైజాగ్‌లో చిన్న ఉద్యోగంలో చేరాను. జగనన్న విద్యాదీవెన పథకం రావడంతో ఇంజినీరింగ్‌ చదవాలన్న నా కల నెరవేరుతోంది. విద్యాదీవెనతో ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరాను. ప్రస్తుతం సెకండియర్‌ చదువుతున్నాను.  
– మోహన్‌కృష్ణ, ఇంజినీరింగ్‌ విద్యార్థి, విజయవాడ  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు