మఠాధిపత్యంపై పీఠాధిపతులతో కమిటీ 

14 Jun, 2021 04:36 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వెలంపల్లి

కమిటీ సూచనల ఆధారంగా తదుపరి మఠాధిపతి ఎంపిక

అప్పటివరకు ‘ఫిట్‌ పర్సన్‌’ నియామకం 

మఠం ఖ్యాతికి భంగం కలగకుండా చర్యలు 

బ్రహ్మంగారి మఠాధిపత్యంపై మంత్రి వెలంపల్లి సమీక్ష 

వివాదాన్ని జఠిలం చేయొద్దని వినతి 

సాక్షి, అమరావతి: చారిత్రక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఖ్యాతి, గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలగకుండా తదుపరి మఠాధిపతిని ఎంపిక చేసేందుకు ధార్మిక పరిషత్‌ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలకు దేవదాయ శాఖ ఉపక్రమించింది. ఈ అంశంపై చర్చించేందుకు ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయం కలిగి ఉండే మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి, దాని సూచనల మేరకు ధార్మిక పరిషత్‌ ద్వారా తదుపరి మఠాధిపతిని ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు మఠానికి తాత్కాలిక ఫిట్‌పర్సన్‌ (పర్సన్‌ ఇన్‌చార్జి)గా వైఎస్సార్‌ కడప జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌ బాలాజీని నియమించారు. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు ఉత్తర్వులు జారీచేశారు.  

మంచి నిర్ణయమే తీసుకుంటాం: మంత్రి
సమావేశానంతరం మంత్రి వెలంపల్లి ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. మఠం పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వీలైనంత త్వరగా మఠాధిపతి ఎంపికపై మంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలాంటి విద్వేషాలకు తావులేకుండా అందరూ సంయమనంతో వ్యవహరించాలని మంత్రి కోరారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 1693లో జీవ సమాధి అయ్యాక, అప్పటి నుంచి వారి వంశమే మఠాధిపత్యం స్వీకరిస్తూ వచ్చిందని.. ఇలా ఇప్పటివరకు 11 మంది కొనసాగారని ఆయన తెలిపారు. ప్రస్తుత మఠాధిపతి మే 8న పరమపదించారని.. ఈ నేపథ్యంలో ఆయన ఇద్దరి భార్యల వారసులు పీఠాధిపతి స్థానానికి పోటీపడడంతో వివాదం ఏర్పడిందన్నారు.

ఇరుపక్షాలు తమ వద్ద వీలునామాలు ఉన్నాయని చెబుతున్నాయని.. కానీ, ఇప్పటివరకు ఏ వీలునామా కూడా దేవదాయ శాఖకు అందలేదని మంత్రి వెలంపల్లి చెప్పారు. నిబంధనల ప్రకారం.. వీలునామా రాసిన 90 రోజుల వ్యవధిలో దానికి ఒక విన్నపాన్ని జతపరిచి దేవదాయ శాఖకు అందజేయాల్సి ఉందని.. అయినా ఏ వీలునామా కూడా దేవదాయ శాఖకు అందనందున తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నందున మఠాధిపతి ఎంపిక సంప్రదాయ బద్ధంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. పీఠాధిపతి ఉన్నప్పుడే తదుపరి ఉత్తరాధికారిని ప్రకటించి ఉంటే సమస్య ఉత్పన్నమయ్యేదే కాదన్నారు.

ముందస్తు నోటీసు ఇచ్చే కమిటీ సమావేశం.. 
ఇదిలా ఉంటే.. దేవదాయ శాఖ పరిధిలో 128 వరకు మఠాలు, పీఠాలు ఉన్నాయని.. వాటిలో బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయాలు కలిగిన ఇతర మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేస్తామని.. కమిటీ సూచనలను ధార్మిక పరిషత్‌ పరిశీలించి తదుపరి మఠాధిపతి ఎంపిక పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. కమిటీ సమావేశం నిర్వహణకు 30 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి సమావేశం నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఇతర మఠాధిపతులు, పీఠాధిపతులు ఎవరైనా  సూచనలు ఇవ్వొచ్చని వెలంపల్లి చెప్పారు. 

మరిన్ని వార్తలు