జనవరిలో ‘రామతీర్థం’ ఆలయం ప్రారంభం

10 Jun, 2021 08:41 IST|Sakshi

దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడి

నూతన ఆలయ నిర్మాణ నమూనాలు విడుదల

నెల్లిమర్ల రూరల్‌/విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీకోదండ రామాలయాన్ని పునర్నిర్మించి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభిస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం రామతీర్థం, విజయనగరంలలో వేర్వేరుగా ఆయన మీడియాతో మాట్లాడారు. రామతీర్థంలోని బోడికొండపై కోదండరామాలయ నిర్మాణానికి రూ.3కోట్లు కేటాయించామని, టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు.

కొండపై ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి ఆలయాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఆగమశాస్త్రం ప్రకారం పండితులు, స్వామీజీల సూచనల మేరకే ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచి పనివారిని రప్పించి పూర్తి రాతి కట్టడంగా ఆలయాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో కలిసి ఆలయ నమూనాలను మంత్రి విడుదల చేశారు.

దేవాలయాల పరిరక్షణే ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపడుతున్నారని విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణలో భాగంగా 65 శాతం ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయిందని తెలిపారు. చంద్రబాబు 40 గుడులు కూల్చితే వాటి అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేశారని పేర్కొన్నారు.
చదవండి: ఏపీని తాకిన రుతుపవనాలు

మరిన్ని వార్తలు