మనుషులా.. రాబంధులా! 

4 Oct, 2020 08:33 IST|Sakshi
తాము నివాసం ఉంటున్న పాక ముందు రమణయ్య కుమార్తెలు  

తల్లిదండ్రుల మృతితో అనాథలైన ఐదుగురు ఆడ పిల్లలు 

మానవత్వం చూపాల్సిన తరుణంలో రాబంధుల్లా వ్యవహరించిన వైనం 

వైఎస్సార్‌ బీమా సొమ్ములో వాటాలు పంచుకున్న వెలుగు ఉద్యోగులు, సిబ్బంది 

వేరొకరి బాకీ డబ్బులకు బీమా సొమ్ము జమ చేసుకున్న కొందరు పెద్దలు 

అందరూ ఆడపిల్లలు. తల్లిదండ్రుల మరణంతో అనాథలయ్యారు. ఉండడానికి సరైన గూడు కూడా లేని దయనీయ స్థితిలో ఉన్న ఆడపిల్లల విషయంలో మానవత్వం చూపాల్సిన కొందరు రాబంధుల్లా వ్యవహరించారు. తండ్రి మరణంతో ప్రభుత్వం అందజేసిన బీమా సొమ్మును ఎవరికి వారు వీలైనంత వాటాలు పంచుకున్నారు. అసలే గిరిజనులు. చదువు సంధ్య లేని అమాయకులు. ఆడపిల్లల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని కొందరు గ్రామ పెద్దలు వేరొకరి బాకీలను, అప్పు ఉన్నాడని డబ్బులు కాజేశారు. 

సాక్షి, నెల్లూరు(కలువాయి):  సాటి మనిషికి కష్టమొస్తే.. అండగా నిలిచి మానవత్వం చూపాల్సిన కొందరు పెద్ద మనుషులు, ప్రభుత్వ ఉద్యోగులు సాయం పేరుతో రాబంధుల కన్నా హీనంగా వ్యవహరించారు. రాబంధులన్నా.. కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ రాబంధులు బతికున్న వాళ్లను పీక్కుతింటున్నారు. అనాథలైన ఆడపిల్లలకు తలో చేయ్యేసి మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన తరుణంలో వీరు తలో చేయ్యేసి వారి సొమ్మును కాజేసి వాటాలు పంచుకున్నారు.   
మండలంలోని దాచూరు ముక్కుతిప్ప గ్రామంలో ఓ పేద గిరిజన కుటుంబం నివాసం ఉంటోంది. మల్లికా రమణయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. అందరూ ఆడబిడ్డలే.   
రమణయ్య చేపల వేటతో ఆ కుటుంబం జీవనం సాగించేది. ఏ పూటకాపూట పని చేస్తేనే కానీ పూట గడవని స్థితి. విధివశాత్తు లక్ష్మమ్మ 13 ఏళ్ల క్రితం మరణించింది.  
అందరూ ఆడపిల్లలు కావడంతో రమణయ్య తాను కాయకష్టం చేసి బిడ్డలను పోషించుకుంటూ వచ్చాడు. అయితే అప్పటికే తన మొదటి ఇద్దరు బిడ్డలు వెంకటరమణమ్మ, అంజలిలకు పెళ్లి చేశాడు.  
ఐదో సంతానం స్వాతి పుట్టుకతో మూగ, మానసిక పరిపక్వత లేకపోయినా ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. 
విధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. రమణయ్య ఈ ఏడాది మార్చి 21వ తేదీ ఆకస్మికంగా మృతి చెందాడు.  
తల్లి, తండ్రి కాలం చేయడంతో ఆ కుటుంబం వీధిన పడింది.  
ఆయన మృతితో మిగిలిన బిడ్డలు అనాథలుగా మారారు. ప్రస్తుతం వీరు పెదనాన్న హనుమంతు సంరక్షణలో ఉన్నారు.  
హనుమంతు కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కూలి పనులు చేసి జీవనం సాగించేవాడు. తనకు భారమైన తమ్ముడి సంతానం బాగోగులు చూస్తున్నాడు.  

వైఎస్సార్‌ బీమా సొమ్ములో ఉద్యోగులు, పెద్దలు వాటాలు 
రమణయ్య మృతితో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ బీమా పథకం కింద రూ.2 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని ఆడ పిల్లల బతుకుదెరువుకు అందించాల్సిన వెలుగు ఉద్యోగులు, గ్రామ పెద్దలు కొందరు వాటాలు పంచుకుని, చివరకు కేవలం రూ.45 వేలు మాత్రమే వారికి అందించారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం అందజేసే సాయాన్ని ప్రతి రూపాయి ఆ కుటుంబ ప్రయోజనాలకే ఉపయోగపడాలని, బ్యాంకర్లు, ప్రైవేట్‌ అప్పుల వాళ్లు తీసుకోకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఇక్కడి ఉద్యోగుల, కొందరు పెద్దలు వ్యవహరించిన తీరు జుగుస్పాకరంగా ఉంది.     
రమణయ్య పేరుతో వేరొక వ్యక్తి బ్యాంక్‌లో తీసుకున్న రుణం బకాయికి కొందరు  పెద్దలు రూ. 12 వేలు జమ చేయించారు. 
మరో వ్యక్తి రమణ్య తనకు బాకీ పడ్డాడని తెల్ల కాగితాలు చూపించి మరో రూ.30 వేలు అప్పు కింద జమ చేసుకున్నాడు.  
వెలుగులో పని చేసే వీఓఏ అధికారులకు, ఖర్చులకు అంటూ రూ.10 వేలు తీసుకున్నారు.  
రమణయ్య కూతురు పొదుపు రుణం ఉందని దానికి జమ చేయించేందుకు కొంత పక్కన పెట్టారు.  
అన్నీ పోగా ఆ కుటుంబానికి బీమా సొమ్ములో రూ. 45 వేలు మాత్రమే మిగిలాయి.  

సమాధానం చెప్పని వెలుగు ఉద్యోగులు 
మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయంపై స్థానిక విలేకరులు వెలుగు ఉద్యోగులను సంప్రదిస్తే సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒకటికి పది సార్లు ఫోన్‌ చేసినా కూడా కనీసం లిఫ్ట్‌ చేయడం లేదు. మరొకరి ద్వారా ఫోన్‌ చేయిస్తే.. తమకేమీ తెలియదంటూ దాట వేస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కాక హడావుడిగా వీఓఏ తీసుకున్న రూ.10 వేల మాత్రం ఆడపిల్లలకు తెచ్చి ఇచ్చేశారు. నెలనెలా ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఇలాంటి సాయంలో కక్కుర్తికి పాల్పడుతున్న ఉద్యోగుల తీరుపై స్థానికులు అసహ్యించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో వీఓఏను కాపాడేందుకే హడావుడిగా స్వాహా చేసిన సొమ్మును తిరిగి తెచ్చి ఇచ్చారని స్థానికులు అంటున్నారు.  

మరిన్ని వార్తలు