దేశ ఆర్థిక వ్యవస్థలో.. పోర్టులదే కీలక పాత్ర 

27 Jun, 2021 04:34 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖ పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, విశాఖపట్నం: కోవిడ్‌ పరిస్థితుల్ని అధిగమించి.. దేశ ఆర్థిక వ్యవస్థలో పోర్టులు కీలకపాత్ర పోషించనున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ ఏబీ సింగ్, నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, విశాఖ పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ కె.రామ్మోహన్‌రావు, జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ వెంకయ్య పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోర్టు చైర్మన్‌ రామ్మోహన్‌రావు, ఇతర అధికారులు పోర్టు పురోగతికి సంబంధించిన వివిధ అంశాల్ని వివరించారు.

103 ఎకరాల్లో రూ.406 కోట్లతో ఫ్రీ ట్రేడ్‌ అండ్‌ వేర్‌హౌసింగ్‌ జోన్‌ ఏర్పాటుచేస్తున్నట్లు ఉపరాష్ట్రపతికి తెలిపారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యూహాత్మక నౌకాయాన మార్గంలో భారత్‌ ఉండటంతో పాటు 7,517 కి.మీటర్ల మేర ఉన్న తీరప్రాంతంలో 200కి పైగా మేజర్, మైనర్‌ పోర్టులు ఉండటం విశేషమన్నారు.  దేశంలో పోర్టు ఆధారిత అభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేంద్రం సాగరమాల కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. కోవిడ్‌ సమయంలో ప్రజలకు అత్యవసరమైన ఆక్సిజన్‌ సరఫరా చేయడంలో పోర్టులు చేసిన కృషిని ఆయన అభినందించారు. విశాఖ పోర్టులో సుస్థిరాభివృద్ధి కోసం ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన, పోర్టు ఆధారిత అభివృద్ధి, డిజిటలైజేషన్‌ వ్యవస్థతో పాటు పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలు ఏర్పాటుచేయడం ప్రశంసనీయమని కొనియాడారు.  

మరిన్ని వార్తలు