ఉద్యమంగా తెలుగు భాష పరిరక్షణ

28 Jun, 2021 04:41 IST|Sakshi

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

సాక్షి, విశాఖపట్నం/కొరుక్కుపేట (చెన్నై): తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. భాషతో సాంకేతికతని అనుసంధానం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ఇందుకు తెలుగు సంస్థలతో పాటు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవాన్ని వర్చువల్‌ విధానంలో ఆదివారం నిర్వహించారు. విశాఖలో ఉన్న వెంకయ్య నాయుడు ఈ వర్చువల్‌ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల వెలుపల ఉండే తెలుగు జనాభా దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత ఉందని గుర్తు చేశారు. వెయ్యికి పైగా తెలుగు సంస్థలు భాషా పరిరక్షణకు పాటుపడుతున్నాయన్నారు.

తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగు వారు తమ సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందించేందుకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. మనం మన భాషను విస్మరిస్తే మన సంస్కృతి, సాహిత్యం, ఆచార వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నూతన విద్యా విధానం మాతృభాషకు పెద్దపీట వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏకతాటి మీదకు తీసుకురావాలన్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆశయాన్ని అభినందించారు. కార్యక్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఆలిండియా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డా.సీఎంకే రెడ్డి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సుందరరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు