ఎన్ని చేసినా ఆ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కథంతే! కొత్త వాహనం కొనివ్వండి

30 Aug, 2022 05:38 IST|Sakshi

కర్నూలు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ తీర్పు

సాక్షి, అమరావతి: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సేవా లోపంతో మానసిక వేదనకు గురైన ఫిర్యాదు దారుడికి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఊరట లభించింది. లోప భూయిష్టమైన పాత వాహనం స్థానంలో కొత్త స్కూటర్‌ ఇవ్వడం.. లేదంటే స్కూటర్‌ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం, మరమ్మతు ఖర్చులు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు కలిపి రూ.77,657ను 6 శాతం వడ్డీతో వాహనం కొనుగోలు చేసిన తేదీ నుంచి లెక్కగట్టి చెల్లించాలంటూ కిషోర్‌కుమార్, నారాయణరెడ్డి, నజీమాకౌర్‌తో కూడిన కర్నూలు జిల్లా కమిషన్‌ ఈనెల 25న తెలుగులో తీర్పు వెలువరించింది.

ఫిర్యాదీ కర్నూలు జిల్లా అవుకు గ్రామానికి చెందిన శంకరశర్మ మానసిక వేద నకు గురైన కారణంగా రూ.10 వేలు, కోర్టు ఖర్చులు రూ.5 వేలు అదనంగా అందించాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ మేరకు నజీమా కౌర్‌ తీర్పు చదవి వినిపించారు. శంకరశర్మ రాజస్థాన్‌లోని ఒకినావా ఆటో టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాన్ని 2018 మే నెలలో రూ.72,900కు కొనుగోలు చేయగా.. అదే ఏడాది ఆగస్టులో డెలివరీ చేశారు.

కొన్నప్పటి నుంచీ వాహనం మొరాయించేది. మరమ్మతులు చేసినా ఫలి తం లేపోయింది. ఈ క్రమంలో ఆయన తనకు న్యాయం చేయాలంటూ 2021 సెప్టెంబర్‌ 25న కమిషన్‌ను ఆశ్రయించారు. వాదనలు విన్న కమిషన్‌ ఈ నెల 10న తుది విచారణ చేపట్టి.. తయారీసంస్థతోపాటు ఇద్దరు డీలర్లు కొత్త వాహనం లేదా తాము సూచించిన విధంగా నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ తీర్పునిచ్చింది.   

మరిన్ని వార్తలు