పత్రికల్లో పాతతరం విలువలు రావాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

13 Nov, 2021 07:43 IST|Sakshi
నెల్లూరులో ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడిని సన్మానిస్తున్న దృశ్యం 

సాక్షి, నెల్లూరు: ‘ ప్రస్తుతం రాజకీయాలు చూస్తే రోతపుడుతున్నాయి. అలాగే పత్రికల్లోనూ విలువలు దిగజారిపోయి సంచలనాల కోసం ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నాయి. అన్ని పత్రికలు చదివితే కానీ వాస్తవాలు తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. పత్రికల్లో పాతతరం విలువలు రావాలి’  అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం నెల్లూరులోని వీపీఆర్‌ కన్వెన్షన్‌లో జరిగిన లాయర్‌ వారపత్రిక 40 వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసగించారు.  

రాను రాను పత్రికల విలువల్లో మార్పు వస్తోందని ఇది కొందరికే వర్తించే అంశమే అయినా ఈ దిశగా ప్రతి పాత్రికేయుడు ఆలోచించాలని  సూచించారు. పాలిటిక్స్, జర్నలి జం, మెడిసిన్‌ ఈ మూడు వ్యాపార ధోరణిలోకి పోకూడదని.. కానీ ఆ మూడు వ్యాపార దోరణీలోనే ఉన్నాయన్నారు.  పాత్రికేయ రంగంలో నార్ల వెంకటేశ్వరరావు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రతిపక్షపాత్ర పోషించాల్సిన బాధ్యత పత్రికలపై ఉందన్నారు.  నెల్లూరులో పులిబొంగరాల న్నా... శెట్టెమ్మ దోశెలన్నా.. ట్రంకురోడ్డులో తెలిసిన వారితో తిరగాలన్నా.. తనకెంతో ఇష్టమని  ఈ పదవుల వల్ల అక్కడికి వెళ్లి తినలేని పరిస్థితి ఉందని   వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా సమయంలో అశువులు బాసిన జర్నలిస్టుల స్మృతికి నివాళులు అర్పించారు. డీఆర్‌డీవో చైర్మన్‌ జి.సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శాంతా బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ వరప్రసాద్‌రెడ్డి, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ కొల్లి శ్రీనాథ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. 

స్వప్నకు తుంగా అవార్డు
తుంగా రాజగోపాల్‌రెడ్డి జ్ఞాపకార్థం ప్రతిఏటా ఇచ్చే అవార్డుకు ఈ ఏడాది ప్రముఖ జర్నలిస్టు స్వప్నను ఎంపిక చేసి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఇచ్చారు.  వీఆర్‌ కళాశాల పూర్వ అధ్యాపకుడు రామచంద్రరావును   సన్మానించారు.

పుస్తకావిష్కరణ..
లాయర్‌ వారపత్రిక సంపాదకుడు తుంగా ప్రభాత్‌రెడ్డి (ప్రభు) రచించిన ‘‘విజయపథంలో నెల్లూరీయులు’’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు