వారసత్వంతో కాదు జవసత్వాలతో రాజకీయాల్లోకి రావాలి: వెంకయ్య నాయుడు

18 Apr, 2022 11:55 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: జిల్లాలోని మచిలీపట్నంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించారు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. పిన్నపనేని కోటేశ్వరరావు నిత్యం ప్రజల కోసం పని చేశారని అన్నారు. కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యేలు పేర్ని నాని, సామినేని ఉదయభాను, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా త ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. జై ఆంధ్ర ఉద్యమంలో పిన్నమనేని కోటేశ్వరరావుతో పాల్గొన్న అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఆహార్యంతో అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి కోటేశ్వరరావు అని, నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి అని ప్రశంసించారు. ఏపీలో కృష్ణాజిల్లాతో ఆయనకు ఒక ప్రత్యేకత ఉందని, 22 ఏళ్లు జిల్లాకు చైర్మన్‌గా పనిచేయడం సాధారణ విషయం కాదన్నారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు పుట్టింది ఈ జిల్లాలోనేనని,  ఘంటసాల వెంకటేశ్వరరావు లాంటి మహనీయులు ఈ జిల్లా వాసులనేనని ప్రస్తావించారు.

పాఠశాలల అభివృద్ధిపై పిన్నమనేని ప్రత్యేక శ్రద్ధ చూపించారు. రాజకీయంగా పార్టీ మారకుండా పార్టీలకు అతీతంగా పాలించడం సాధారణ విషయం కాదు. ఇప్పుడున్న రాజకీయాల్లో హుందాతనం తగ్గిపోతుంది. చట్ట సభల్లో శాసన సభ్యులు మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. వారసత్వంతో కాదు జవసత్వాలతో రాజకీయాలలోకి రావాలి. కులం కన్న గుణం మిన్న అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సమయాల్లో రాజకీయపార్టీలు అమలుకాని హామీలు ఇస్తున్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోకి చట్టబద్దత కల్పించాలనే డిమాండ్ వస్తుంది. ఇది మంచిదే.. దీనిపై విస్తృత మైన చర్చ జరగాలి’ అని తెలిపారు

చదవండి: ఏపీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు.. ఇక సులభంగా మ్యుటేషన్లు

మరిన్ని వార్తలు