డ్రైవర్ల విజయోత్సవం

1 Oct, 2023 04:46 IST|Sakshi

సీఎం జగన్‌కు కృతజ్ఞతగా గొల్లపూడిలో ఆటోలతో ర్యాలీ  

భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలో శనివారం విజయోత్సవం నిర్వహించారు. వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు వరుసగా ఐదోసారి ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతాపూర్వకంగా ర్యాలీ నిర్వహించారు.

గొల్లపూడి పంచాయతీ పరిధిలోని వన్‌ సెంటర్, సాయిపురం కాలనీ, పంచాయతీ కార్యాలయం, పటమట బజార్‌ వంటి ముఖ్యకూడళ్ల మీదుగా ఆటోల ర్యాలీ సాగింది. దాదాపు 250 ఆటోలలో వచ్చి న ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, క్యాబ్‌ డైవర్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను కొనియాడుతూ పాడిన పాటలతో ఆయా కూడళ్లు మార్మోగాయి. ‘సంక్షేమ సారథి జగనన్న.. మళ్లీ మీరే ముఖ్యమంత్రిగా రావాలి’ అంటూ డ్రైవరన్నలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.  

దేశంలో మరెక్కడా లేనివిధంగా.. 
దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రమే తమకు ఏటా ఆర్థిక సహాయం అందించారని డ్రైవరన్నలు కొనియాడారు. సీఎం జగనన్న నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి నాటినుంచి ఇప్పటివరకు ఒకొక్కరికి రూ.50 వేల చొప్పున లబ్ధి చేకూరిందన్నారు.

నవరత్నాల పేరిట అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో ఒక్కొక్కరికీ రూ.లక్షల లబ్ధి చేకూరిందని, సీఎం జగన్‌ తమ కుటుంబాల్లో వెలుగులు నింపారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ర్యాలీలో ఏఎంసీ చైర్మన్‌ కారంపూడి సురే‹Ù, గంగవరపు శివాజీ, ధూళిపాళ చిన్ని, కోమటి రామమోహన్‌రావు, సహకార బ్యాంక్‌ చైర్మన్‌ బొర్రా వెంకట్రావు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు