ప్రతిష్టాత్మకంగా ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానం

14 Mar, 2023 03:22 IST|Sakshi

ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడండి 

అధికారులకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రజిని ఆదేశం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందని, త్వరలో సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. వైద్యశాఖలోని అన్ని విభాగాల అధిపతులతో సోమవారం మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో మంత్రి రజిని 2023–24 బడ్జెట్‌ అంచనాలు, వైఎస్సార్‌ కంటివెలుగు, ఆరోగ్యశ్రీ, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, 104 వాహనాలు, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్స్‌పై సమీక్షించారు.

ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్‌ జిల్లా నోడల్‌ అధికారులు తమ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ను పరిశీలించి లోటుపాట్లు ఉంటే సరిచేయాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లో ఎక్కడా వైద్య సిబ్బంది కొరత ఉండటానికి వీల్లేదని స్పష్టంచేశారు. మందులషాపుల్లో మత్తు మందులు, ఇతర అనధికారిక విక్రయాలను అరికట్టాలని ఔషధ నియంత్రణ విభాగాన్ని ఆదేశించారు.‘వైఎస్సార్‌ కంటివెలుగు’ మూడో దశలో భాగంగా 35,42,151మంది వృద్ధులకు ఆరు నెలల్లో స్క్రీనింగ్‌ పూర్తి చేయాలని చెప్పారు.

అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయాలని, మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. చికిత్స కోసం వచ్చే రోగులకు ఇంటి నుంచి ఆస్పత్రికి, చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి ఇంటికి చేర్చడానికి రవాణా సౌకర్యం కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. 146 కొత్త 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్స్‌ అందుబాటులోకి వస్తున్న దృష్ట్యా పాతవాటిలో ఎన్ని ‘మహాప్రస్థానం’ సేవలకు పనికొస్తాయో చూడాలన్నారు. వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ నివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డీఎంఈ వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు