3 రాజధానులే మా విధానం 

13 Sep, 2022 04:26 IST|Sakshi
రైతులకు ఎల్‌పీసీలు అందజేస్తున్న మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని 

తంగుడుబిల్లిలో జగనన్న కాలనీకి భూమిపూజ

మధురవాడ (భీమిలి): రాష్ట్రంలో మూడు రాజధానులే తమ ముఖ్యమంత్రి ఉద్దేశం, తమ ప్రభుత్వ విధానం అని విశాఖ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఆమె సోమవారం విశాఖ జిల్లా ఆనందపురం మండలం తంగుడుబిల్లిలో 519 ఎకరాల్లో 263 కోట్లతో నిర్మించనున్న 16,690 ఇళ్ల జగనన్న హౌసింగ్‌ కాలనీకి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మలతో కలిసి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖలో పరిపాలన, కర్నూలులో న్యాయ, అమరావతిలో శాసన రాజధానుల ఏర్పాటుతో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడుకి రాష్ట్రం బాగుపడడం, మంచి జరగడం ఇష్టం ఉండదని, అందుకే అమరావతి పేరుతో పాదయాత్ర ప్లాన్‌ చేశారని విమర్శించారు.

ఈ వయసులో చంద్రబాబు పాదయాత్ర చేయలేడని, లోకేశ్‌ చేసినా ఉపయోగంలేదని భావించి అమరావతి పేరుతో అక్కడి వారిని రెచ్చగొట్టి పాదయాత్రకు ప్లాన్‌ చేశారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జనం జగనన్న వెంటే ఉన్నారన్నారు. అమరావతి పేరుతో జరుగుతున్న పాదయాత్ర వల్ల ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తినా చంద్రబాబే బాధ్యత వహించాలని చెప్పారు.

ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అటు సూర్యుడు ఇటు వచ్చినా విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని పేర్కొన్నారు. చంద్రబాబులాంటి వారు ఎన్ని కుట్రలు పన్నినా అడ్డుకోలేరన్నారు. పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా ఆగదని చెప్పారు. ప్రజలకు మేలు చేయడానికి కావాల్సింది పెద్ద వయసు కాదని, పెద్ద మనసని పేర్కొన్నారు. ఆ పెద్ద మనసు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు