నకిలీ మందుల ఊసే ఉండకూడదు

20 May, 2022 05:34 IST|Sakshi

మంత్రి విడదల రజని 

సాక్షి, అమరావతి: ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, వారి ప్రాణాల కంటే ఏదీ ఎక్కువకాదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని చెప్పారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ సాధనే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. ఆమె గురువారం సచివాలయంలో రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మందుల ఊసే ఉండకూడదని, కాలం చెల్లిన మందులు ఎక్కడా కనిపించకూడదని చెప్పారు. అన్ని మందుల షాపులను నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రతి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నెలలో 50కి పైగా మెడికల్‌ షాపులను తనిఖీ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు.

నిబంధనలు పాటించని బ్లడ్‌ బ్యాంకులను గుర్తించాలన్నారు. ఇష్టానుసారంగా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించే వారిపై కన్నేసి ఉంచాలన్నారు. లైసెన్సుల జారీ, రెన్యువల్స్‌లో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. నిజాయితీగా పనిచేసే అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.

రీజనల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ల ఏర్పాటు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు వాహనాల కేటాయింపు వంటి కొన్ని సమస్యలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. ఔషధ నియంత్రణ విభాగం డీజీ ఎస్‌.రవిశంకర్‌ నారాయణన్, డైరెక్టర్‌ ఎం.బి.ఆర్‌.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు