కన్నీరు తుడిచి.. బాసటగా నిలిచి..

29 Aug, 2022 04:04 IST|Sakshi
మంత్రికి బాలుడి గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే

బాలుడికి బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.50 లక్షలు మంజూరు చేయించిన మంత్రి రజని

వినుకొండ (నూజెండ్ల): క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడికి బోన్‌మారో చికిత్సకు రూ.50 లక్షలు మంజూరు చేయించి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ఆ పేదకుటుంబం కన్నీరు తుడిచారు. వినుకొండ రూరల్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు అశోక్‌బాబు పరిస్థితిని స్వయంగా చూసిన మంత్రి వెంటనే ఆస్పత్రిలో చేర్చించాలని  సూచించారు.

అశోక్‌బాబు తండ్రి మూడేళ్ల కిందట చనిపోయాడు. తల్లి కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో అశోక్‌కు క్యాన్సర్‌ అని, చికిత్సకు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని తల్లికి తెలిసి హతాశురాలైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె ప్రమాదవశాత్తు గాయపడింది. గ్రామ సర్పంచి సురేష్‌ ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బాలుడి తల్లికి భరోసా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో శనివారం వినుకొండ వచ్చిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రజనికి  బాలుడి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే వివరించి సహాయం చేయాలని కోరారు. అశోక్‌బాబును తీసుకొచ్చిన బంధువులు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. బాలుడి పరిస్థితి చూసి సీఎంవో అధికారులతో మాట్లాడిన మంత్రి వైద్యానికి అయ్యే ఖర్చు రూ.50 లక్షలను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బాలుడిని ఆస్పత్రిలో చేర్పించాలని బంధువులకు సూచించారు. 

మరిన్ని వార్తలు