ప్రాథమిక వైద్యంలో పెనుమార్పులు

9 Aug, 2022 04:43 IST|Sakshi

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రజని

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాక ప్రాథమిక వైద్యం విభాగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాడు–నేడు పనులపై ఆమె సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 10,032 విలేజ్‌ క్లినిక్‌ల నిర్మాణానికి రూ.1,500 కోట్లు, 184 పట్టణ ఆరోగ్య కేంద్రం భవనాల ఆధునీకరణ, 344 కొత్త భవనాల నిర్మాణానికి రూ.665 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 976 పీహెచ్‌సీల ఆధునీకరణ, 150 కొత్త పీహెచ్‌సీల నిర్మాణానికి రూ.367 కోట్లు.. ఇలా మొత్తంగా ప్రాథమిక వైద్యం బలోపేతానికి రూ.2,532 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు.

భవనాల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తిచేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. పనుల పురోగతికి సంబంధించి ఇకపై ప్రతీనెలా తానే స్వయంగా సమీక్షిస్తానని రజని చెప్పారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు