రూ.16 వేల కోట్లతో ఆస్పత్రుల అభివృద్ధి 

24 Jul, 2022 03:56 IST|Sakshi
ఆస్పత్రిలో సౌకర్యాలపై ఆరా తీస్తున్న మంత్రి రజని, చిత్రంలో ఎమ్మెల్యే భూమన

ఆగస్టు 1 నుంచి ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వ్యాధులు 

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని 

తిరుపతి (తుడా): రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.16 వేల కోట్లు కేటాయించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. శనివారం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్‌ శిరీషతో కలిసి ఆమె తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవల గురించి వార్డుల్లో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, వారి సహాయకుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించే విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. ఆగస్టు 1 నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వ్యాధులను చేర్చేలా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు ఇచ్చారన్నారు. మొత్తం 3 వేల వ్యాధులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానున్నాయన్నారు. ఆస్పత్రులలో పనిచేసే పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఏజెన్సీలపై విచారణ చేయాలని డీఎంఈని ఆదేశించారు. 

తీరు మారకుంటే సరెండర్‌ చేస్తాం 
రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి పనితీరుపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మంత్రి రజని స్పందిస్తూ.. సక్రమంగా విధులు నిర్వహించలేనప్పుడు తప్పుకోవచ్చుగా అంటూ సూపరింటెండెంట్‌పై మండిపడ్డారు. ‘మీ నిర్లక్ష్యం లేకుంటే ఇంత మంది ఎందుకు ఫిర్యాదు చేస్తారు.. ఇకనైనా తీరు మారకుంటే హెడ్‌ ఆఫీస్‌కు సరెండర్‌ చేస్తాం’ అని హెచ్చరించారు. మంత్రి వెంట డీఎంఈ ఎం.రాఘవేంద్రరావు, డీఎంహెచ్‌ఓ శ్రీహరి, ఈఈ ధనంజయరెడ్డి, ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రశేఖరన్, మెటర్నిటీ సూపరింటెండెంట్‌ లక్ష్మీప్రసన్న, సీఎస్‌ఆర్‌ఎంఓ ఈబీ దేవి, పార్థసారథి ఉన్నారు.   

మరిన్ని వార్తలు