సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ 

26 Jul, 2022 05:12 IST|Sakshi

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రజని 

సాక్షి, అమరావతి:  సీజనల్‌ వ్యాధుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో సీజనల్‌ వ్యాధులు, కోవిడ్, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం, మంకీ ఫాక్స్‌ తదితర అంశాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల కారణంగా ఒక్క మరణం సంభవించినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డెంగీ, మలేరియా వంటి వ్యాధులను గుర్తిస్తే.. వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, పరీక్షల కిట్లు, రక్తపు నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.  కోవిడ్‌ ప్రికాషన్‌ డోసు పంపిణీని వేగవంతం చేయాలన్నారు. ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న ఫ్యామిలీ డాక్టర్‌ విధా నంపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉంటారని, వారిలో ఒకరు పూర్తిగా 104 వాహనం ద్వారా గ్రామాలకు వెళ్లి సేవలందిస్తారని తెలిపారు. సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ నివాస్‌ తదితరులున్నారు.   

మరిన్ని వార్తలు