మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే సీఎం జగన్‌ లక్ష్యం: విడదల రజిని

7 Mar, 2023 19:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో మహిళా సాధికారత, సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని, సీఎం వల్లే ఇది సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజని అన్నారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “మహిళా సాధికారత, సమానత్వం” అంశంపై పలువురు మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ప్రతి అడుగులోనూ సీఎం జగన్‌ మహిళలకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో మహిళకు ప్రాధాన్యత పెరగడానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఒక కారణమన్నారు. నవరత్నాల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందే అన్నారు. మహిళలకు అన్ని స్థాయిల్లో మేలు చేస్తున్నాం కాబట్టే తమ రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

మాటకు, చేతకు మన్నన ఇచ్చే మనసున్న వ్యక్తి సీఎం జగన్‌ అని కొనియాడారు. మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద తామే నిలబడి ఎదగాలని మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రధానంగా అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, కాపునేస్తం వంటి పథకాల ద్వారా సాధికారతతో పాటు తోడ్పాటు అందిస్తున్నామన్నారు.

విద్యతోనే కుటుంబ తలరాతలు మారుతాయని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి.. జగనన్న అమ్మఒడి ద్వారా ఏటా రూ.15,000ల ఆర్థిక సాయం, జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన, మెరుగైన, రుచికరమైన పౌష్టికాహారం, 9 రకాల వస్తువులతో కూడిన జగనన్న విద్యాకానుక కిట్, జగనన్న విద్యాదీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, భోజన, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన వంటి పథకాలు విద్యారంగంలో అమలు చేస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్నారన్నారు.

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 3255 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందించడమే గాకుండా చికిత్స అనంతరం రోగి కోలుకునే సమయంలో ఆర్థికంగా ఇబ్బంది ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్య ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. గర్భవతిగా ఉన్నప్పుడే మహిళలకు, పుట్టిన అనంతరం చిన్నారులకు సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా సంపూర్ణ పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీలు క్షేమంగా చికిత్స అనంతరం ఇంటికి చేర్చేలా తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

విద్యార్థుల ఆరోగ్యం, వైద్యం, భవిష్యత్ లో ఉద్యోగాల కల్పన వంటి అన్ని అంశాల గురించి ఆలోచిస్తోన్న ప్రభుత్వం తమదన్నారు. దిశ యాప్ ద్వారా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కేబినెట్‌లో మహిళలకు మంత్రులుగా అవకాశమివ్వడమే కాకుండా నామినేటెడ్ పనులు, నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ అవకాశం కల్పించారన్నారు.

కడుపులో ఉన్న బిడ్డ మొదలుకొని చివరి దశ వరకు అన్ని స్థాయిల్లో ప్రభుత్వం సేవలందిస్తోందన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, తమ ముఖ్యమంత్రి మహిళా పక్షపాత సీఎం అని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక అవకాశాలు కల్పిస్తున్న మంచి మనసున్న సీఎం.. వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభం కాబోతుందని తద్వారా ప్రభుత్వ వైద్యులే ఇంటికి వచ్చి వైద్యం అందించే వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు. 

ఏపీలో ప్రతి రోజూ మహిళా దినోత్సవమే: వాసిరెడ్డి పద్మ
ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  రాష్ట్రాన్ని మహిళాంధ్రప్రదేశ్ గా మార్చారని అన్నారు. మహిళల కోసం సమస్త యంత్రాంగం, వ్యవస్థ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రిదన్నారు. అడగకుండానే అన్నింట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. మహిళా సంక్షేమం కోసం ఎంతైనా చేయాలన్న తపన ముఖ్యమంత్రికి ఉందన్నారు. ప్రతి మహిళ జీవితంలో మార్పు రావాలన్నదే ఆయన లక్ష్యమన్నారు.

అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్న వాసిరెడ్డి పద్మ.. మహిళా సాధికారత సాధన కోసం సీఎం.. వినూత్న పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు అవసరమైన తోడ్పాటు, ఆర్థిక చేయూతను ఈ పథకాల ద్వారా అందజేస్తున్నారన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తూ, గ్రామ సచివాలయాల్లో పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కచెల్లెమ్మలకు అభయ హస్తమందిస్తున్నారన్నారు.

మహిళలపై ఏ చిన్న అఘాయిత్యం జరిగినా 21 రోజుల్లోనే వేగవంతమైన దర్యాప్తు చేసి నేరస్తులను పట్టుకొని శిక్షలు విధిస్తోన్న ప్రభుత్వం తమదేనన్నారు. ప్రస్తుతం మహిళను శక్తిగా గుర్తించే పరిస్థితి సీఎం జగన్‌ తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారం తో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మనసా, వాచా, కర్మనః ముఖ్యమంత్రి వేస్తున్న ప్రతి అడుగూ మహిళ అభ్యున్నతి కోసమేనన్నారు. మహిళల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రోజూ మహిళా దినోత్సవమే అన్నారు. 

మహిళా సాధికారత సాధనకు సీఎం జగన్‌ ప్రభుత్వం కృషి: చల్లపల్లి స్వరూపరాణి
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ చల్లపల్లి స్వరూపరాణి మాట్లాడుతూ  మహిళా సాధికారత సాధనకు సీఎం జగన్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో హింసా ప్రవృత్తి తగ్గుముఖం పట్టిందన్నారు. గృహహింస కేసులు తగ్గడం శుభపరిణామమన్నారు. మహిళలు పనిచేసే ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయడంతో పాటు అణగారిన వర్గాల మహిళల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు, మహిళలకు చేరడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. గతంలో కన్నా ఆర్థిక, రాజకీయ స్వావలంబన మెరుగవడం సంతోషకరమన్నారు.

ఒక్క ఫోన్ కాల్‌తో రక్షణ: సరిత
ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ కె.జి.వి సరిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు తోడ్పాటు, చేయూతనందిస్తోందన్నారు. మహిళలు తమలోని శక్తిని తామే గుర్తించి సంకల్ప బలంతో ముందుకు వెళ్లాలని సూచించారు. దిశ చట్టాన్ని రూపొందించడం ద్వారా ప్రభుత్వం మహిళల భద్రత కు భరోసా కల్పిస్తుందన్నారు, దిశ యాప్  ద్వారా అరచేతిలో మహిళలు, యువతులకు రక్షణ వ్యవస్థ ఏర్పాటైందన్నారు.

ఒక్క ఫోన్ కాల్ తో రక్షణ అందిస్తున్నామన్నారు. మహిళలు ఎదిగేందుకు సంక్షోభ నిర్వహణ, ఇతరుల బాధను తమ బాధ అనుకోవడం, సమిష్టిగా పనిచేయడం, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, ఏం కోల్పోయినా తిరిగి పునర్నిర్మాణం చేసుకోవడం(స్థితిస్థాపకత), శారీరక, మానసిక ధృడత్వం వంటి 5 లక్షణాలు తప్పనిసరన్నారు. మహిళలపై ఏదైనా అఘాయిత్యాలు, వేధింపులు, దాడులు వంటివి జరిగితే వ్యక్తిగత సమస్యగా కాకుండా తమ సమస్యగా భావించి రిపోర్ట్ చేస్తే వెంటనే సపోర్ట్ అందిస్తోంది. ఈ ప్రభుత్వమన్నారు. గ్రామస్థాయిలో సైతం తమ సమస్యలు విన్నవించేందుకు, వెంటనే పరిష్కరించేందుకు గ్రామ సంరక్షణ కార్యదర్శులను సైతం ప్రభుత్వం నియమించిందన్న విషయం గుర్తుచేశారు. మహిళలు ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలన్నారు. న్యాయబద్ధమైన సమానత్వం కావాలని ఆకాంక్షించారు.

మహిళల అభ్యున్నతి కోసం ఆలోచించిన వ్యక్తి  సీఎం జగన్‌: రావూరి సూయిజ్
మార్పు ట్రస్ట్ డైరెక్టర్ రావూరి సూయిజ్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం సీఎం జగన్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. ప్రతి రంగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన వ్యక్తి సీఎం జగన్‌ అని అన్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లో టెక్స్ టైల్స్ రంగానికి రాయితీలు ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది మహిళలకు ఆ రంగంలో అవకాశాలు లభించనున్నాయన్నారు. మనబడి నాడు-నేడు పథకం ద్వారా కల్పిస్తున్న మౌలిక వసతులు, ఆధునికీకరణ వల్ల గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెరిగిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా మహిళల అభ్యున్నతి కోసం అన్ని రకాలుగా ఆలోచించిన వ్యక్తి  సీఎం జగన్‌ అని కొనియాడారు. 

ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం:  జర్నలిస్టు రెహానా
మీడియా అడ్వైసర్ కమిటీ సభ్యురాలు, జర్నలిస్టు రెహానా బేగం మాట్లాడుతూ మహిళలు సమాన హక్కులు కాదు సమాన విజయాలు సాధించాలన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు అవకాశాలు దక్కుతున్నాయన్నారు. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా సంక్షేమ పథకాలు, రాజకీయ సాధికారతకు అద్దం పట్టేలా రాజకీయ ప్రాధాన్యతను సీఎం జగన్‌ కల్పించారన్నారు.

రేషన్ కార్డులో పేరు మొదలుకొని ఇళ్ల రిజిస్ట్రేషన్ వరకు ప్రతి ఒక్కటి  మహిళ పేరు మీదే అందజేసి యాజమాన్య హోదా కల్పించిందీ ప్రభుత్వమన్నారు. ఉన్నతవిద్యలో మహిళలకు మరిన్ని అవకాశం కల్పించే అంశంపై దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో సెర్ప్, మెప్మా అధికారులు, సిబ్బంది, అన్ని జిల్లాల నుండి వచ్చిన డ్వాక్రా మహిళలు,  తదితరులు పాల్గొన్నారు.
చదవండి: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌: మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు