జగన్‌ పాలనలోనే.. మహిళలకు మహోన్నత గౌరవం

8 Mar, 2023 02:42 IST|Sakshi
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మంత్రి విడదల రజిని

అడగకుండానే వరాలిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు

వారి కేంద్రంగానే ఏపీలో సంక్షేమ పథకాల అమలు

మహిళల భవితను సమూలంగా మార్చేస్తున్న ‘నవరత్నాలు’

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రజిని

‘ది హిందూ’ దినపత్రిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

‘మహిళా సాధికారత, సమానత్వం’ అనే అంశంపై చర్చలో మహిళా ప్రతినిధులు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మహిళలకు మహోన్నత గౌరవం దక్కుతోందని, ఇది దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన అరుదైన ఘనత అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ది హిందూ జాతీయ దినపత్రిక ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత, సమానత్వం’ అంశంపై మంగళవారం చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి రచయిత్రి ప్రసూన సంధానకర్తగా వ్యవహరించగా హిందూ జీఎం ఎస్‌డీటీ రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన చర్చలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి రజిని మాట్లాడుతూ.. తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని మహిళలు అడిగినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని.. కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం అడక్కుండానే మహిళలకు అనేక వరాలిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. నవరత్నాల ద్వారా అమలుచేస్తున్న ప్రతి పథకం మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిందేనని మంత్రి అన్నారు. ఇక చర్చా గోష్టిలో పాల్గొన్న వారు ఏమన్నారంటే..

మహిళాంధ్రప్రదేశ్‌గా ఏపీ.. 
రాష్ట్రంలో మహిళను నిర్ణయాత్మక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దే. ఆంధ్రప్రదేశ్‌ను మహిళాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. అడక్కుండానే అన్నింట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. మహిళల కోసం ఇంతగా చేస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిరోజూ మహిళా దినోత్సవమే అని గర్వంగా చెప్పుకోవచ్చు.     
– వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

దిశ బిల్లుతో అద్భుత ఫలితాలు
దేశంలో మరెక్కడా లేని విధంగా ఏపీలోనే దిశ బిల్లు రూపుదిద్దుకుంది. ఇది చాలా విప్లవాత్మక విజయాలను సాధిస్తోంది. అనేక రాష్ట్రాలు దీనిపై ఆసక్తి చూపిస్తున్నాయి. అనేక కేసుల్లో నెలరోజుల్లోపే శిక్షలు పడుతున్నాయంటే అది దిశ బిల్లు ఘనతే.
    – కేజీవీ సరిత, ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఎస్పీ  

ఆర్థిక, రాజకీయ స్వావలంబన మెరుగుపడింది
రాష్ట్రంలో మును­పెన్న­డూ లేని విధంగా మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వావలంబన మెరుగు­పడటం సంతోషకరం. మహిళలు పనిచేసే ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయడంతోపాటు అణగారిన వర్గాల మహిళల సమస్యలపై ప్రభుత్వం దృష్టిసా­రించాలి.    
    – చల్లపల్లి స్వరూపరాణి, ఏఎన్‌యూ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు