ఆస్పత్రుల దోపిడీపై విజి‘లెన్స్‌’

29 Apr, 2021 04:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్ర వ్యాప్తంగా 35 ఆస్పత్రుల్లో సోదాలు

8 జిల్లాల్లో అక్రమాలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు

రోగుల సంఖ్య నమోదులో తేడా.. ఆరోగ్యశ్రీ ఉన్నా అక్రమంగా ఫీజుల వసూలు

రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల దుర్వినియోగంపై కేసుల నమోదు

సాక్షి, అమరావతి: కరోనా బాధితులను నిలువు దోపిడీ చేస్తున్న ఆస్పత్రులపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటైన 18 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 35 ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించాయి. అక్రమాలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) కె.రాజేంద్రనాథ్‌రెడ్డి ఒక ప్రకటన ద్వారా మీడియాకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్యం అందించడంలో చోటుచేసుకుంటున్న అవకతవకలను నిరోధించేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించి పెద్దఎత్తున సోదాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆస్పత్రుల్లో ఆమోదించిన దానికంటే అధికంగా ఫీజులు వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ వర్తించదంటూ తప్పుదోవ పట్టించడం, రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను దుర్వినియోగం చేయడం వంటి అక్రమాలను తనిఖీల్లో గుర్తించినట్టు ఆయన తెలిపారు. ఇలాంటి అవకతవకలకు పాల్పడిన 9 ఆస్పత్రుపై ఐపీసీ, డ్రగ్స్‌ అండ్‌ కాస్మోటిక్‌ యాక్ట్, విపత్తు నివారణ చట్టం కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు మూడు కేసుల్లో నిందితులను అరెస్ట్‌ చేశామని, మరో రెండు కేసుల్లో నిందితులు పరారీలో ఉన్నారని వివరించారు. మిగిలిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసులు నమోదు చేసిన 9 ఆస్పత్రులు, వాటిలో గుర్తించిన ఆక్రమాలు ఇలా ఉన్నాయి.

రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు పక్కదారి
► విజయనగరం క్వీన్‌ ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్స్‌లో రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు దుర్వినియోగం చేశారు. కేస్‌ షీట్‌లో రోగుల లెక్కలు తప్పుగా చూపి రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల లెక్కలను తారుమారు చేశారు. ఈ హాస్పిటల్‌పై ఐపీసీ సెక్షన్లు 188, 420 కింద కేసు నమోదు చేశారు.
► ఒంగోలులోని ప్రకాశం హాస్పిటల్‌లో రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు దుర్వినియోగం చేశారు. రికార్డుల్లో లెక్కలకు హాస్పిటల్‌లో ఉన్న వాటికి పొంతన లేదు. రికార్డుల్లో పేర్కొన్న లెక్క ప్రకారం 57 ఇంజెక్షన్లు లేవు. ఈ ఆస్పత్రిపైనా 188, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
► నెల్లూరు రిచ్‌ ఆస్పత్రిలో రెమిడెసివిర్‌ దుర్వినియోగం జరిగాయి. రికార్డుల్లో చూపిన 31 ఇంజక్షన్లు లేవు. ఈ ఆస్పత్రిపై సెక్షన్లు 188, 420 కింద కేసు నమోదు చేశారు.
► కర్నూలు గాయత్రి హాస్పిటల్‌లో లెక్కల్లో చూపిన 70 రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు దుర్వినియోగం చేశారు. ఈ ఆస్పత్రిపై సెక్షన్లు 420, 40, 188తోపాటు డ్రగ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 51 కింద కేసు నమోదు చేసి హాస్పిటల్‌ ఎండీని అరెస్ట్‌ చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉన్నప్పటికీ రోగుల నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అడ్వాన్సుగా వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై సెక్షన్లు 188, 420 కేసు నమోదు చేయగా.. ఆస్పత్రి ఎండీ, సీఈవోలు పరారీలో ఉన్నారు.
► గుంటూరు జిల్లా నరసరావుపేట పువ్వాడ హాస్పిటల్‌లో నిబంధనలకు విరుద్ధంగా రోజుకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. దీనిపై సెక్షన్లు 188, 420తోపాటు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 51 ప్రకారం కేసులు నమోదు చేశారు. అనంతపురం ఎస్వీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నిబంధనలకు విరుద్ధంగా రోజుకు రూ.25 వేలు వసూలు చేస్తూ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. దీనిపై సెక్షన్లు 188, 420, 406తోపాటు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 51 ప్రకారం కేసు నమోదు చేశారు. ఆస్పత్రి ఎండీని అరెస్ట్‌ చేశారు.
► వైఎస్సార్‌ జిల్లాలో కేసీహెచ్‌ హాస్పిటల్‌లో రోజుకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేయడంతోపాటు రోజుకు రూ.3 వేల చొప్పున ఒక్కో రోగి నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు. సెక్షన్లు 188, 420 కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్‌ చేశారు. 
► వైఎస్సార్‌ జిల్లాలోనే కొమ్మ హాస్పిటల్‌లో రోజుకు రూ.25 వేలు వసూలు చేస్తూ ఆక్సిజన్‌ కోసం మరో రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. ఈ ఆస్పత్రిపై ఐపీసీ సెక్షన్లు 188, 420 కేసు నమోదు చేశారు.
► పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని జేకే ఆస్పత్రి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ రెసిడెన్సీ లాడ్జిలో అనధికారికంగా చికిత్సలు చేస్తున్నట్టు గుర్తించారు. లాడ్జిలో చికిత్స పొందుతున్న ఐదుగురు కోవిడ్‌ బాధితులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లాడ్జిని సీజ్‌ చేశారు. జేకే ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు పొందుతున్న రోగులను వేరే ఆస్పత్రులకు తరలించిన అనంతరం కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు