అప్పన్న భూముల కైంకర్యంపై విజిలెన్స్‌ విచారణ

10 Aug, 2021 02:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉండగా సింహాచలం ఆలయానికి చెందిన 862.22 ఎకరాలను దేవుడి భూములు కాదంటూ ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. అప్పట్లో ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన భూములు ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఈ వ్యవహారంలో లబ్ధి  పొందిన వారెవరు? దేవదాయ శాఖ చట్ట నిబంధనలను ఉల్లంఘించి జరిగిన ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖను ఆదేశించింది. 3 నెలల్లోగా విచారణ ముగించి ప్రభుత్వానికి నివేదిక అందచేయాలని నిర్దేశించింది. విచారణలో గుర్తించిన అంశాల ఆధారంగా తదుపరి చేపట్టాల్సిన చర్యలపైనా నివేదికలో తగిన సూచనలు చేయాలని పేర్కొంది. మెడికల్‌ కాలేజీ పేరుతో మాన్సాస్‌ ట్రస్టు భూములను కారుచౌకగా అప్పటి ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టిన తీరు తెన్నులపైనా ఈ విచారణ కొనసాగనుంది. ఆయా అంశాలపై విజిలెన్స్‌ విచారణకు తగిన తోడ్పాటు, అవసరమైన పత్రాలు అందజేసేందుకు దేవదాయ శాఖ కమిషనర్‌ను నోడల్‌ అధికారిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు. 

ప్రాథమిక విచారణలో అక్రమాల నిర్థారణ
సింహాచలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మాన్సాస్‌ ట్రస్టులో అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో 2016 నుంచి 2018 వరకు పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగినట్లు దేవదాయ శాఖ గుర్తించింది. దీనిపై ప్రాథమిక విచారణ కోసం దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న చంద్రకుమార్, విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, విశాఖ డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్థన్‌లతో కూడిన కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ వారం రోజులకు పైగా మరోసారి తనిఖీలు నిర్వహించి 108 పేజీల నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు అందజేసింది. ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూముల మాయం నిజమేనని ప్రాథమిక విచారణలో కమిటీ తేల్చడంతో పాటు అప్పట్లో ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన  862.22 ఎకరాల్లో కొన్ని ఇప్పటికీ రెవిన్యూ రికార్డుల్లో సింహాచలం ఆలయం పేరిట ఉన్నట్లు వెల్లడించింది. దీని ద్వారా ఎవరు లబ్ధి పొందారన్నది తేలాలంటే దర్యాప్తు సంస్థలతో క్షుణ్నంగా విచారణ నిర్వహించాలని కమిటీ సూచించడంతో ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. 

బోర్డులో అశోక్‌తో పాటు బాబు సన్నిహితుడు
సింహాచలం ఆలయ భూములు, మాన్సాస్‌  ట్రస్టు బోర్డులో భూ అక్రమాలు జరిగిన సమయంలో ట్రస్టు బోర్డు చైర్మన్‌గా అశోక్‌గజపతి రాజే ఉన్నారు. మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారాల పర్యవేక్షణకు గత సర్కారు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో  చైర్మన్‌ అశోక్‌తో పాటు చంద్రబాబుకు సన్నిహితుడైన కుటుంబరావు సభ్యుడిగా ఉన్నారు.

ఇద్దరు అధికారులపై ఇప్పటికే చర్యలు..
ఈ వ్యవహారంలో భాగస్వామ్యలైన అప్పటి సింహాచలం ఈవో, ప్రస్తుతం దేవదాయ శాఖ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న రామచంద్రమోహన్‌తోపాటు నాటి విశాఖ దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్, ప్రస్తుతం సింహాచలం ఆలయంలో ఏఈవోగా ఉన్న సుజాతను ప్రభుత్వం 4 రోజుల కిత్రం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. 

మెడికల్‌ కాలేజీ అంటూ మభ్యపెట్టి...
విజయనగరంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామంటూ మభ్యపెట్టి గత ప్రభుత్వ పెద్దలు వందల ఎకరాల మాన్సాస్‌ భూములను విక్రయించిన వ్యవహారంపై కూడా విజిలెన్స్‌ అధికారులు విచారణ జరపనున్నారు. మెడికల్‌ కాలేజీ కోసమంటూ విశాఖకు సమీపంలో మాన్సాన్‌ ట్రస్టు పేరిట ఉన్న 150.09 ఎకరాల భూమిని, మరో 1,430 చదరపు గజాల వాణిజ్య భూమిని గత సర్కారు తమకు కావాల్సిన వారికి కారుచౌకగా కట్టబెట్టింది. అయితే మెడికల్‌ కాలేజీ కోసం అప్పటి ప్రభుత్వం గానీ, మాన్సాస్‌ ట్రస్టు తరఫున గానీ కనీసం దరఖాస్తు కూడా చేయలేదని అధికారుల కమిటీ గుర్తించింది. మచ్చుకు 36.11 ఎకరాల విక్రయాల రికార్డులను పరిశీలించగా అందులోనే రూ.74 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు కమిటీ ప్రాథమికంగా గుర్తించింది. సింహాచలం ఆలయం ఉన్న కొండపై గ్రావెల్‌ను అక్రమంగా విక్రయించారని, మాన్సాస్‌ ట్రస్టు భూములలో ఇసుక అమ్మకాలలోనూ భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని కమిటీ నిర్ధారించింది.  

మరిన్ని వార్తలు