‘మెడాల్‌’ మాయ.. టెస్టులు పేరుతో దందా

18 Sep, 2020 09:14 IST|Sakshi
మెడాల్‌లో తనిఖీలు చేస్తున్న విజిలెన్స్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

సిటీ స్కాన్‌కు అదనంగా వసూళ్లు 

అసలు రూ.2,500.. వసూలు రూ.4,500 

ఒంగోలు మెడాల్‌ కేంద్రంపై విజిలెన్స్‌ ఆకస్మిక దాడులు 

హార్డ్‌ డిస్క్‌లు, పలు పత్రాలు సీజ్‌ 

ఒంగోలు: వైద్యో నారాయణో హరి.. అని ప్రపంచం మొత్తం కొనియాడుతున్న వేళ కొందరు అక్రమార్కుల చేష్టలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. ప్రపంచం మొత్తాన్ని కోవిడ్‌ వణికిస్తున్న వేళ కనిపించని శత్రువుపై జనం సామూహిక పోరాటం సాగిస్తున్న తరుణంలో కొన్ని ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్వాహకులు కాసుల వేట ప్రారంభించారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు రోగి వ్యాధి తీవ్రతను గుర్తించేందుకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి పలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగాలు సంయుక్తంగా జిల్లా కేంద్రం ఒంగోలులోని మెడాల్‌ కేంద్రంపై దాడులు జరిపాయి. కేవలం ఒక్క సిటీ స్కాన్‌కే రూ.2,000 అదనంగా వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది.  

కోవిడ్‌ పరీక్షల పేరుతో అటు ఆసుపత్రులు, ఇటు ప్రైవేటు ల్యాబ్‌లు డబ్బులు దండుకుంటున్నాయన్న విమర్శలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. అయిన దానికి, కాని దానికి సిటీ స్కాన్‌ పేరుతో అనవసర పరీక్షలు చేయిస్తున్నారు. తద్వారా వ్యాధి నిర్థారణకే ప్రజలు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సిటీ స్కాన్‌కు ప్రభుత్వం రూ.2500 మాత్రమే వసూలు చేయాలని ఉత్తర్వులు జారీచేయగా కొన్ని ల్యాబ్‌లు రూ.4వేల నుంచి రూ.4500 వరకు వసూలు చేస్తున్నాయి. కోవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉన్నవారు, ప్రైమరీ లేదా సెకండరీ కాంటాక్టులు ఉన్నవారు ప్రైవేటు ల్యాబ్‌లు, ఆసుపత్రులను ఆశ్రయిస్తుండటంతో నిర్ధారణ పరీక్షకు 1400లు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా అవసరాన్ని బట్టి అధిక దోపిడీ చేస్తున్నారు. ఇక రూ.800కు గతంలో చేసే రక్త పరీక్షలు ఇప్పుడు రూ.1500కు పెంచేశారు. ఇలా పలు విధాలుగా ప్రజానీకం దోపిడీకి గురవుతున్న వేళ మెడాల్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం సంచలనంగా మారింది.  

తనిఖీ ఇలా..
కోవిడ్‌తో బాధపడుతున్న ఒక పేషెంటుకు సిటీ స్కానింగ్‌ చేయించుకోవాల్సి వచ్చింది. అతను ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కన్నా అధిక మొత్తం వసూలు చేస్తున్నారంటూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ కార్యాలయంలో రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో విజిలెన్స్‌ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి ఒక వైద్యుడు సంయుక్తంగా గురువారం మెడాల్‌ ల్యాబ్‌కు వెళ్లారు. ఫిర్యాదుదారు నుంచి సిటీ స్కాన్‌కు  రూ.4500 వసూలు చేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా గుర్తించారు. అనంతరం మెడాల్‌ కేంద్రంలోని పరీక్షల యంత్రాలను పరిశీలించారు. ఇన్‌స్ట్రుమెంటల్‌ సర్టిఫికేట్లు కావాలని కోరగా కొన్ని చూపించలేకపోయారు. రిసెప్షన్‌ కౌంటర్‌ వద్ద ఏయే పరీక్షకు ఎంతెంత వసూలు చేస్తున్నారో బోర్డు ప్రదర్శించాల్సి  ఉన్నా అది కూడా లేనట్లు గుర్తించారు. దీంతో మెడాల్‌ ఒంగోలు బ్రాంచి మేనేజర్‌ సాయికిరణ్‌కు వారంరోజుల్లోగా అన్ని పత్రాలను సమర్పించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. హార్డ్‌డిస్‌్కలలో లభించే సమాచారం ఆధారంగా జిలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు విజిలెన్స్‌ అధికారులు మెడాల్‌ ఒంగోలు కేంద్రంపై చర్యలకు సిఫార్సు చేయనున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.  

మరిన్ని వార్తలు