భూమా నారాయణరెడ్డిని బెదిరించిన అఖిలప్రియ భర్త, తమ్ముడు

4 Nov, 2020 10:41 IST|Sakshi
నంద్యాల తాలూకా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న భూమా నారాయణరెడ్డి  

పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు 

సాక్షి, నంద్యాల: ‘నిన్ను చంపితే కాని మాకు చైర్మన్‌ పోస్టు రాదు’ అని విజయ డెయిరీ చైర్మన్‌ భూమా నారాయణరెడ్డిని భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం నంద్యాల తాలూకా పోలీసులు ఐపీసీ 448, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాలూకా సీఐ దివాకర్‌ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. విజయ డెయిరీ పాలక మండలి సమావేశం గత నెల 28వ తేదీన జరగగా డైరెక్టర్లను మాట్లాడాలని పిలిపించుకొని భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్‌ ఆళ్లగడ్డలో ఉంచుకున్నారు.

ముగ్గురు డైరెక్టర్లు ఈ సమావేశానికి గైర్హాజరు కావడంతో 28వ తేదీ జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన మళ్లీ సమావేశం నిర్వహిస్తున్నామని విజయడెయిరీ చైర్మన్‌ ఎండీ ప్రసాదరెడ్డి డైరెక్టర్లకు సమాచారం అందించారు. డైరెక్టర్లు కొందరు మంత్రాలయం, కర్నూలులోని పలు ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. డైరెక్టర్లు వెళ్లిన చోట జగత్‌విఖ్యాత్‌ రెడ్డి మనుషులు కనిపించడంతో తిరిగి వారు రైతునగరం గ్రామంలోని భూమా నారాయణరెడ్డి నివాసానికి వచ్చారు.

విషయం తెలుసుకున్న భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవరామ్, రవి తమ అనుచరులతో కలిసి వాహనాల్లో నారాయణరెడ్డి ఇంటి వద్దకు 1వ తేదీ రాత్రి 11.20గంటలకు వెళ్లి వాగ్వాదానికి దిగారు. ‘నిన్ను చంపితే గాని చైర్మన్‌ పదవి మాకు రాదు అంటూ’ భూమా నారాయణ రెడ్డిని హెచ్చరించారు.  దీంతో మంగళవారం బాధితుడు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.   

మరిన్ని వార్తలు