పథకాలు ఉచితాలు కావు.. భవిష్యత్తుకు పెట్టుబడి

16 Aug, 2022 04:48 IST|Sakshi
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా వస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, నేతలు

మేనిఫెస్టోనే కరదీపికగా సీఎం జగన్‌ పాలన

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు 

జెండాను ఎగురవేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: మేనిఫెస్టోనే కరదీపికగా.. సమన్యాయం, సమగ్రత, సమానత్వం ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పాలన అందిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ప్రభుత్వం వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలు ఉచితాలు కావని.. వారి భవిష్యత్తుకు పెట్టుబడి అని తెలిపారు. ఏ కులమైనా.. ఏ మతమైనా.. అందరికీ ఒకే గౌరవం ఉండాలన్నదే వైఎస్సార్‌సీపీ సిద్ధాంతమని ఆయన స్పష్టంచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన విజయసాయిరెడ్డి  మహాత్మాగాంధీ, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్, పింగళి వెంకయ్య, సుభాష్‌ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజులతో పాటు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతిఒక్కరికీ ఒకే విధమైన న్యాయం అందాలన్నదే వైఎస్సార్‌సీపీ మొదటి సిద్ధాంతమన్నారు. రెండోది.. దేశ సమగ్రత అని, గతంలో మత ప్రాతిపదికన దేశం ఎలా విడిపోయిందో, భవిష్యత్తులో విభజన జరగకుండా అందరూ సమైక్యంగా ఉండాలన్నారు.

మూడోది.. సమన్యాయమని, సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాలు ధనికులతో సమానంగా అభివృద్ధి చెంది, అందరికీ ఒకే రకంగా గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకురావాలనేది వైఎస్సార్‌సీపీ, సీఎం జగన్‌ సిద్ధాంతమని వివరించారు. శాసన మండలిలో చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్యవరప్రసాద్, మురుగుడు హనుమంతరావు, మొండితోక అరుణ్‌కుమార్, పోతుల సునీత, శాసన మండలిలో విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా మాట్లాడారు. అంతకుముందు.. జాతీయ జెండాలు చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు.  

మరిన్ని వార్తలు