విశాఖ ఉక్కు కోసం న్యాయస్థానాలను ఆశ్రయిద్దాం: విజయసాయి రెడ్డి

3 Aug, 2021 16:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ఢిల్లీలో వరుసగా రెండో రోజు నిర్వహిస్తున్న ధర్నాకు వైఎస్‌ఆర్‌సీపీ కాంగ్రెస్‌ ఎంపీలు మద్దతు తెలిపారు. ఆంధ్రా భవన్‌ ఆవరణలో మంగళవారం ఉక్కు కార్మికులు చేపట్టిన ఆందోళనకు వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా  వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘‘ఉక్కు కార్మికులకు భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఒక ఏడాది పాటు ఇదేలా కొనసాగిస్తే సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది. ఎన్నికలు ముందు పెట్టుకుని ఏ ప్రభుత్వమూ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోదు’’ అని తెలిపారు. 

ఒక సంవత్సరం పాటు పోరాటాన్ని కొనసాగించాలంటే మనం అందరం కలిసి సంఘటితంగా పోరాటం చేయాలని విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు. అవసరమైతే కోర్టులను ఆశ్రయించి ప్రైవేటీకరణ ప్రక్రియపై స్టే తీసుకురావాలని సూచించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయంలోనే అనేక అవకతవకలు ఉన్నాయని.. అవన్నీ ప్రభుత్వంలోని పెద్దలకు తెలుసు అన్నారు. కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఉక్కు కార్మికుల పోరాటంలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని ఎల్లవేళలా కోరుకుంటున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు.
 

మరిన్ని వార్తలు