భోగాపురానికి విశాఖ ఎయిర్‌పోర్టు 

6 Sep, 2021 03:54 IST|Sakshi

ప్రస్తుతమున్న విమానాశ్రయం రక్షణ శాఖకు అప్పగిస్తాం 

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి 

సాక్షి, విశాఖపట్నం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమయ్యాక విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయాన్ని అక్కడకు తరలిస్తామని రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి తెలిపారు. ఎయిర్‌పోర్టును తరలించిన అనంతరం ఆ స్థలాన్ని తిరిగి రక్షణ శాఖకు అప్పగిస్తామన్నారు. ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..  భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉందన్నారు.

విశాఖ పోర్టు ట్రస్టు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. సీ పోర్టు నుంచి భీమిలి వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్‌ అండ్‌ బీ ఆధ్వర్యంలోనూ, భీమిలి నుంచి భోగాపురం వరకూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (ఎంఏయూడీ) పర్యవేక్షణలో రహదారి నిర్మాణం చేపడతామన్నారు. రోడ్డు నిర్మాణంలో ప్రభుత్వ భూముల్నే ఎక్కువగా వినియోగించుకుంటామని.. అవసరమైతే తప్ప ప్రైవేట్‌ భూములు సేకరించకూడదని భావిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు.

స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో గరిష్ట వేగం తగ్గేలా నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇక నగర పరిధిలో 70 మీటర్లు, నగరం దాటిన తర్వాత 70కి పైగా రహదారి వెడల్పు ఉంటుందని వివరించారు. రహదారి నిర్మాణంలో భాగంగా వాకింగ్, సైకిల్‌ ట్రాక్‌ కూడా ఏర్పాటుచేస్తామని చెప్పారు. న్యాయస్థానంలో కేసులు కొలిక్కి రాగానే ఎయిర్‌పోర్టు, రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. 

మరిన్ని వార్తలు