బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏపీ మిస్‌..!

24 Mar, 2021 04:35 IST|Sakshi

రైల్వే జోన్‌ను తక్షణం ఏర్పాటు చేయాలి

టీటీడీ సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలి

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌ మిస్‌ అయ్యిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లు–2021పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొంది ఏడేళ్లయినా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ సాకారం కాలేదు. వాల్తేరు డివిజన్‌ను కలుపుతూ రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాలను కేంద్ర జల సంఘం రూ.55,656 కోట్లుగా సిఫారసు చేసింది. కానీ కేంద్రం గత ఏడాదిగా దీనిపై చర్య తీసుకోలేదు. విశాఖలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్, నిఫ్ట్, ఏపీలో టెక్స్‌టైల్‌ పార్కులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ హామీలు కూడా నెరవేరలేదు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ.. కాఫీ ప్లాంటేషన్‌ పనులను ఉపాధి హామీ పథకం (నరేగా) పనుల నుంచి తొలగించింది. అరకు, పాడేరు కాఫీ పంటలకు ప్రసిద్ధి.

నరేగా నుంచి కాఫీ ప్లాంటేషన్‌ పనులు తొలగిస్తే గిరిజనులకు ఎలాంటి ఉపాధి లభిస్తుంది? ఎకరాకు రూ.15 వేల చొప్పున వారు నష్టపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.120 కోట్ల మేర జీఎస్టీ చెల్లిస్తోంది. ప్రసాదం తయారీ, కాటేజీల అద్దెకు కూడా జీఎస్టీ, సర్వీస్‌ చార్జ్‌ వసూలు చేయడం సమర్థనీయం కాదు. హిందువులకు టార్చ్‌బేరర్‌ను అని చెప్పుకునే బీజేపీ వీటిని జీఎస్టీ నుంచి ఎందుకు మినహాయించలేదు?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చర్చ అనంతరం ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ సమాధానమిస్తూ.. టీటీడీ సేవలను జీఎస్టీ నుంచి మినహాయించే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

మరిన్ని వార్తలు